పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/132

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
114
గణపతిముని చరిత్ర


ఆ మాటలను భగవానుడు తన్ను ఉద్దేశించియే చెప్పెనని గ్రహించి, నాయన మాటలను తాను నమ్మనందులకు భగవానుడు తన చెంపపై కొట్టినట్లుగా పార్వతీశము భావించి పశ్చాత్తాపమును పొందెను.

దీనిని బట్టి నాయనకు భగవానుని యొద్దగల చనువు, నాయన యందు భగవానునకు గల ప్రేమ చాల గాఢముగా నుండెనని స్పష్టమగు చున్నది.

22-3-1935 తేది నాయన కలకత్తాకు లక్ష్మికాంతముతో వెళ్ళెను. అక్కడ ఒకనాడు నేమాని సూర్యనారాయణ ఒక బీగమును నాయన శిరస్సునకు అడుగున్నర యెత్తున రెండు మూడు నిముషములు పట్టుకొనిన పిదప విద్యుత్ర్పయోగముచే అది అయస్కాంతమువలె నయ్యెను. అప్పు డతడు కొన్ని గుండుసూదులను తెచ్చి దాని సమీపమున నుంచెను. అది అయస్కాంతము వలెనే గుండు సూదులను ఆకర్షించుటను అతడు అందఱకు చూపెను.

అక్కడ నాయన విశ్వమీమాంసకు తాత్పర్యము, ఆత్మకథ, పూర్వకథ తెలుగులో రచింప నారంభించెను. ఈ సమయమున లక్ష్మికాంతము మొదలగువారికి ఎన్నో విషయములను బోధించెను. స్వలాభములేని కర్మలు సకామ్యములైనను గొప్పవే అని; ఇటీవలి వారు జ్యోతిష యుగములకు, ధర్మ యుగములకు గల భేదమును గుర్తింపలేదని; వైదికమత ప్రామాణ్యమునకు ఇతర మతము లేవియు సరికావని; బుద్దుడు నాస్తికుడుగా పరిగణింప బడినను వేదమతానుయాయులు వేదములను విచక్షణముతో విమర్శించి గ్రహింప వలయునను తలంపుతోనే వేద ప్రామాణ్యమును నిరసించెనని;