పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సశాస్త్రీయంగా వాదనలలో అత్యంత సులువుగా గెలిచిన ధీరోదాత్తుడు. దేవతలనేకుల దర్శన కృపలను పొందిన స్రష్ఠ. అనేకానేక మంత్రములలో ద్రష్ఠ. " తారామంత్రము" ఉత్తర భారతమునుండి దక్షిణ భారతమునకు దెచ్చినది నాయనే. పుట్టుక నుండియే వాక్సిద్ది, నిర్భయత్వమునకు మారుపేరు. ఏకసంథాగ్రాహి. సూర్యునివలె కళంకరహితమగు భావన, ఆచరణ, నమ్మిన సిద్దాంతములపై సమదృష్టి, గణనాథునివలె విఘ్నములెన్ని ఎదురైననూ చలించక, అదరక, బెదరక, తప్పించుకొన యత్నించక, ధైర్యముగా నెదుర్కొని విఘ్నములకే విఘ్నములను గల్గించి. నిర్విఘ్నముగా అసంఖ్యాకమగు శిష్యబృందముతో, భారతావనిలోని అనేకానేక ప్రాంతములలో తనపేరు మారు మ్రోగుచుండ ధీరుడై, గంభీరుడై, ప్రచండుడై దేశ దాస్యవిముక్తికై, వైదిక ధర్మోద్ధరణకై సంకుచిత కుటిల మనస్కులగు పండితులమని పిలిపించుకునే వారల అహంకారములను పాతిపెడుతూ, దిగ్విజయ యాత్రలతో, పుణ్యక్షేత్ర, తీర్థ, సందర్శనములతో, ప్రజల నుత్తేజ పరుస్తూ, కార్యోన్ముఖుల కావిస్తూ, అతులిత ప్రజ్ఞా పాటవములకు ఆలవాలమై వెలుగుతూ వుండిన నాయనకు ఒక క్షణమున "తనను గురించి తానెరుగ దలంచిన వేళ" తను అంతవరకు నేర్చినది తృణప్రాయమని గ్రహించి, సత్యాన్వేషణ తత్పరుడై అరుణగిరిని చేరి అందు జంగమస్వరూపముగానున్న తేజోమూర్తిని చూచి - అహంకార, మమకార, వగైరాదులను వీడి సాష్టాంగ ప్రణామమొనరించి, వినయ శీలుడై, వివేకోదయము కొరకు ఆత్మోన్నతి కొరకు, తానెవరో తెలుసు కొనుటకై పరితాపముతో తన అంతరంగిక బాధను వెడలగ్రక్కినాడు.

ఒక విషయం : మనము ఎక్కడికైనా వెడితే మన బంధువులో, స్నేహితులో, ఆశ్రితులో వుంటే ఎదుటివారికి సాష్టాంగ పడటం నామోషి అనిపిస్తుంది. అహంకార మడ్డువస్తుంది. మరి