Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"అట్లే చేయు" డనెను. నాయన వారివెంట గోకర్ణమునకు పోయెను. అక్కడ కూడ ఎండ నాయనకు దుర్భరముగానే యుండెను. దైవరాతుని తమ్ముడు సీతారాముడు అక్కడనుండి ఆయనను "కుళువే" గ్రామమునకు చేర్చెను. అది శిరిసికి దగ్గర. అది సముద్రతీరమునకు దూరమందున్నను 2000 అడుగుల యెత్తున నుండుటచే చాల చల్లగా నుండును.

వాసిష్ఠుడు కుళువేలో అహల్య అను నామెకు పీడను తొలగించి, తరువాత నామె భర్తకు టైఫాయిడ్ జ్వరము వచ్చినప్పుడు దానిని కూడ మాయమగునట్లు చేసెను. ఒకనాడు వాసిష్ఠుడు ఒక పాకలో శిష్యపరివృతుడై కూర్చుండి యుండగా సమీపములో గడ్డివాము లంటుకొని అగ్నిజ్వాల పాకను చుట్టుముట్టెను. వెంటనే వాసిష్ఠుడు పారాశరుని యగ్ని మంత్రమును అస్త్రముగా ప్రయోగించెను. పాకనుండి సుడిగాలి బయలుదేరి గడ్డివాములను జ్వాలలతో కూడ దూరముగా చిమ్మివేసెను. ఈ సంఘటనముల వలన అక్కడివారికి వాసిష్ఠుని మహిమలయందు గాఢమైన విశ్వాస మేర్పడెను.

మహాదేవుడు ఆస్తి విషయము తండ్రితో మాటాడుటకు కుళువేకు వచ్చెను. తండ్రికొడుకులు మోటారుబండిలో పయనించు చుండగా అది ఒక ప్రక్కకు పడెను. మహాదేవుని మోచేయి విఱిగెను. సమీపమందున్న వైద్యుడు తాత్కాలికముగా కట్టుకట్టి "పెద్దాసుపత్రికి తీసికొనిపొం" డనెను. మహాదేవుడు భయపడు చుండగా వాసిష్ఠుడు ఋగ్వేదములోని అస్థిసంధాన మంత్రమును పఠించి క్షణములో విఱిగిన చేతిని అతుకుకొనునట్లు చేసి