శ్లో|| బాల్యాదిష్యపి జాగ్రదాదిఘ తథా సర్వాస్యవస్థాన్వపి
వ్యావృత్తాస్వసు వర్తమాన మహ మిత్యన్త: స్పురన్తస్సదా |
స్వాత్మానం ప్రకటికరోతి భజతాం యోభద్రయాముద్రయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||
పై శ్లోకాలలో స్థూలముగా గోచరించే అర్థానికైననూ, అంతర్లీనమై నిండి నిబిడీకృతమైయున్న అంతరార్థమునకైననూ, శ్రీగురు శిష్య సంబంధము, శ్రీగురుడే పరబ్రహ్మమనెడి నియమబంధము, అర్హత, యోగ్యతలు గల్గిన శిష్యులకెలా శ్రీగురు పరబ్రహ్మ కృప లభ్యమగునో యనెడి మధురానుబంధములు. అంతరాంతరాళములను తట్టి తమస్సునుండి లేపి తపస్సునకు వెళ్లమని ప్రేరేపించ గలవు. పారమార్ధికమున తపన, తపన అధికమైన అదియే తపస్సుగా మారి తమస్సును తొలగిస్తుంది.
భగవాన్, నాయనల బంధము, అటువంటిది. నయనములు అందరికీ వుండవచ్చును. కానీ చూడకలిగే శక్తి కొందరికే వుంటుంది. అదియునూ వారివారి సంస్కారములను, ఆలోచనలను బట్టి, చూచిన దానిని గురించి ఏదోఒక భావన కలుగుతుంది. అలాగే సత్యాన్వేషణతో పరితపించే హృదికల్గిన నయనములతో, నాయన చరిత్రను పారాయణమొనరిస్తే నయనానందకరముగా బాష్పానందములు భగవాన్ నాయనల పదపంకజములపై కృతజ్ఞతతో అమృత జలపాతముగా వర్షించగలవు. ఆ అదృష్టశాలురేక్కడో ఒకరిద్దరుండ వచ్చునేమో ! చదవడం మనస్సుతో చేసే ప్రక్రియ. పారాయణం బుద్ధితో జరిగేక్రియ. పారాయణం పరాయణత్వాన్నిస్తే చదువు ఆలోచనలను రేకెత్తించి, అహాన్ని పెంచగలిగే ప్రమాదం కూడా కలదు. చదువు భౌతికము, అహమునకు నాంది. విద్య పారమార్థికము వివేకమునకు నాంది. "విద్యయొసగును వినయంబు" విద్య,