పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/103

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గాని వెనుకటవలె పాల్గొనక త్వరగా మరలి వచ్చి, చూతగుహ యందే కాలక్షేపము చేయజొచ్చెను. కొందఱి వలన రమణాశ్రమము వ్యాజ్యములపాలై అక్కడి వాతావరణము కలుషితమై యుండుటచే వాసిష్ఠుడు అక్కడి వారితో మాటాడుటకూడ మానుకొనెను. ఆయనకు ఆ యూరు విడిచి కొంతకాలము ఎక్కడికైనను పోవలయునను తలంపు గాడమగు చుండెను. ఆ సమయమున నాయనను శ్రీఅరవిందుడు చూడగోరుచున్నాడని సుధన్వుడు లేఖ వ్రాసెను. దానిని నాయన రమణునకు రహస్యముగా చూపెను. "సరే వెళ్లి రండి" అని రమణుడు అనుజ్ఞ నిచ్చెను. అది నెపముగా నాయన 1928 ఆగష్టు రెండవ వారములో తిరువణ్ణామలై వీడుటకు సిద్ధపడు చుండగా సుధన్వుడు వచ్చి ఆయనను పుదుచ్చేరికి తీసికొని పోయెను.

1928 లో ఆగష్టునకు ముందు సుధన్వుడు ఉమా సహస్రమును శ్రీఅరవిందునకు పంపెను. దానిని సాంతముగా చదివి అతడు కావ్యకంఠుని చూడవలయునని శ్రీమాత వలన సుధన్వునకు తెలియజేసెను. అందువలన సుధన్వుడు అంత శ్రద్ద వహించెను. శ్రీఅరవిందుడు ప్రకటించుచున్న "ఆర్య" పత్రికను చదివినప్పటి నుండియు వాసిష్ఠుడు చాల యేండ్ల క్రిందటనే శ్రీఅరవిందుని తన పూర్వజన్మ తపస్సఖులలో నొకనినిగా గుర్తించి శిష్యులతో చెప్పు చుండెను. ఆతనిని దర్శింపవలయును అను కుతూహలము కూడా నాయనకు ఉండెను. ఈ సందర్భమున గుంటూరు లక్ష్మీకాంతము వ్రాసిన విషయము గమనింపదగియున్నది. "తనకంటె వయస్సున పెద్దవాడు, తపశ్శాలి, పూర్వజన్మ తపస్సఖుడైన శ్రీఅరవిందుని