పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45


ముట్నూరు

కై ఫియ్యతు మౌంజే ముట్నూరు సంతు పొంన్నూరు తాలూకె

రెపల్లె సర్కారు ముత్తు౯జాంన్నగరు రాజా భావఁన్నా

మాణిక్యారావు

పూర్వం త్రేతాయుగమంద్దు యీస్తలం దండకారణ్యములోనిది గన్కు శ్రీరామస్వామివారు శీతాలక్ష్మణ సమెతులై అరణ్యవాసమునకు వచ్చినప్పుడు శితామహాదేవి రజస్వరాలయినంద్ను యిక్కడ కొలను యెప౯రచి స్నానం చేయించ్చినారు గన్కు అయొక్క కొలన్కు శీతగుండ్డం అనే పేరు వచ్చింది. తదనంతరం ఆ ప్రదేశమంద్దు గ్రామం యెప౯డి రజస్వలాపురమనె అభిదానం యెప౯డ్డది. ప్రాయశహ తెనుగుభాషను ముట్నూరు అంట్టూ వుంన్నారు. యింద్కు దృష్టాంత్తం సదరహి గ్రామాన్కు దక్షిణ పాశ్వ౯ం పూర్వం అమ్మవారు స్నానఁ చెశ్ని శితగుఁడ్డాన్కి దక్షిణపుకట్ట మీదను జమ్మిచెట్టు మొదటను వక శిలయందు శితాంమ్మవారి పాదాలు బహుసుంద్దరంగ్గా యేప౯డి వున్నది. బహుమంది జనులు యీస్తలంలోకివచ్చి యీశిత గుండ్డం యందు స్నానంచేశి అమ్మవారి పాదాలు శెవించ్చి వెళ్ళుతూవుంన్నారు.———

ద్వాపరయుగము గడచి కలియుగ ప్రవేశమయి యుధిష్టర విక్రమ శకంబ్బులు గడచి శాలివాహన శకప్రవెశమయ్ని తర్వాతను స్వస్తిశ్రీ త్రిభువన చక్రవర్తి శ్రీమద్రాజాధి రాజదేవర విజయ రాజ్య సంవత్సరంబ్బులు శాలివాహనం ౧౦౫౬ (1135 AD) శకం మొదలుకొని గజపతి శింహ్వాసనస్థుడయ్ని గణపతి మహారాజులుంగ్గారు రాజ్యం చెశె యెడల విరి ప్రధానులయ్ని గొపరాజు రామంన్నగారు శా ౧౦౬౭ (1145 AD) శకమంద్దు బ్రాంహ్మణులకు గ్రామ మిరాశిలు నిణ౯యించ్చే యెడల యీ ముట్నూర్కు వెలనాటి కౌండిన్యసగోత్రులయ్ని ఆరాధ్యుల వార్కి మిరాశియిచ్చినారు.

తదనంతరం రెడ్లు ప్రభుత్వాన్కి వచ్చి రాజ్యం చెశెయడల ప్రోలయ వేమారెడ్డిగారి ప్రభుత్వం జర్గినమీదను అనపోతయ వేమారెడ్డిగారు ప్రభుత్వం చెశెటప్పుడు యీ గ్రామం తమ మేనమామ అయ్ని నాగ సేనాపతి పెరను యీగ్రామన్కు రాజనాగపురం అనె పెరు బెట్టి అగ్రహారం యిచ్చెను.

శ్లోకం (1) పౌరోహిత్యం పాచకత్వం ప్రభుత్వం జ్యోతిస్సారం హెమముద్రా పరిక్షా
సాముద్రాఖ్యం లేఖకం యాజమాన్యం ప్రొక్తంసద్భి: గ్రామ భోగాష్టకంహి.

అనే న్యాయం చాతను అష్టభోగ సహితంగ్గా యిచ్చెను.

తా॥ గ్రామ భోగములు ఎనిమిది - అందు (1) పురోహితము (2) వంటను చేయుట (3) గ్రామాధికారము (4) జ్యోతిశ్శాస్త్రవేత్తృత్వము (5) బంగారు నాణెముల పరీక్ష (6) హస్తసాముద్రము (7) వ్రాయసదనము (8) యాజమాన్యము లేక పెత్తందారీతనము— -