పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

85


ఏనాటికైనా భారతదేశం పైకి రావాలంటే, ఈ దేశ ప్రజలు కనీసం ప్రాథమిక విద్య అయినా ఆర్జించాలి. ఈ గెజిటు ప్రకటనల వంటివి విద్యాభివృద్ధికి అవరోధాలు కాకమానవు.

మద్రాసులో ఒక విద్యార్థి చదువుకొని, పైకి రావడానికి వెయ్యిన్నొక్క కష్టాలు పడవలసి ఉందని మా అనుభవం చెప్తూంది. యూరపులో, అమెరికాలో ఉన్నట్లుగా మద్రాసు స్థానికులకు ఉచిత విద్య అందించే పాఠశాల కాని, మాతృభాషలో విద్య నేర్పించే పాఠశాలకాని, ప్రారంభం కాలేదు. అనాదిగా కొనసాగుతున్న వీధిబళ్ళు పిల్లలు ఇంట్లో అల్లరి చెయ్యకుండా చూడడానికి తప్ప, అక్కడ నేర్పించేదేమి లేదు.

వీలున్నంతలో ఎంతమంది విద్యార్థులకు మంచి ఇంగ్లీషువిద్య చెప్పించడానికి కుదురుతుందో అంతమందికి అవకాశం కల్పించాలి. మంచి ఇంగ్లీషు విద్యను సముపార్జించడమే అసలు సమస్య. ఒక తాలూకాఫీసు గుమాస్తా సంగతే తీసుకొందాం. అతను పదిహేను రూపాయల జీతంతో పెద్ద కుటుంబాన్ని పోషించవలసి ఉంటుంది. పిల్లల్ని చదివించాలని ఎంత తపనపడ్డా ఏ విధంగా చదివించగలడని ప్రశ్నిస్తున్నాము. ఈ ప్రెసిడెన్సీలో అతితక్కువ ఫీజులు వసూలు చేసే ప్రభుత్వ, ఎయిడెడు పాఠశాలల ఫీజులు కూడా సామాన్యులకు అందుబాటులో లేనంత అధికంగా ఉన్నాయి. ఇక జీతాలుకాక, పుస్తకాలు, ఇతర ఖర్చులు ఉండనే ఉన్నాయి. ఈ ప్రెసిడెన్సీలో ఎంతోమంది తల్లితండ్రులకు సంతృప్తికరంగా తమ పిల్లలకు చదువు చెప్పించుకోడానికి అవకాశం లేదు. ఈ ఇబ్బందులకు తోడుగా ప్రభుత్వం కొత్తగా టర్మ్‌ఫీజు విధానం ప్రవేశపెట్టింది. ఇప్పుడు పాఠశాలల్లో నెలనెల జీతాలు కట్టించుకోడం లేదు. ఒక్కసారిగా మూడునెల్ల జీతమో, ఆరునెల్ల జీతమో ముందుగా చెల్లించమంటున్నారు. మద్రాసులో ఉద్యోగులకు నెలకొకసారి వేతనం అందుతుంది. నిత్యం డబ్బుకు ఇబ్బంది పడేవారు అంతమొత్తం ఒక్కసారిగా చెల్లించమంటే ఎక్కడ నుంచి తెస్తారు. పూర్వం భారత ప్రభుత్వ చట్టసభలో మంత్రిగా పనిచేసిన సర్ ఆక్‌లాండ్ కాల్విన్ (Sir Auckland Calvin) ఆదాయం పన్ను మిద చేసిన ప్రకటన ఈ దేశంలో పేదరికాన్ని గురించి తెలుసుకోడానికి పనికి వస్తుంది. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేవిధంగా ఫీజులు వసూలు చెయ్యాలి. పేద విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చెయ్యకూడదు. ఇతర పరగణాలలో మాదిరి కాకుండా ఈ ప్రెసిడెన్సీ పాఠశాలల్లో ఒకటి రెండు వాయిదాలలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ఆధునికవిద్య పేదలకు, సంపన్నులకు అందరికీ సమానంగా అందుబాటులో ఉండేది. పచ్చయ్యప్ప విద్యాసంస్థలు, మిషనరీ పాఠశాలలు విద్యార్థులవద్ద నెలజీతం రూపాయి కట్టించుకొని మెట్రిక్యులేషను పరీక్షకు సన్నద్ధం చేసేవి. సంపన్నులు మాత్రమే జీతాలు కట్టేవారు. పేదవిద్యార్థులు ఏమి చెల్లించకుండానే ఈ పాఠశాలల్లో చదువుకొనేవారు.