పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

దంపూరు నరసయ్య


వడ్డీ వ్యాపారులు. వీరు రుణదాతలు మాత్రమేకాక, నరసయ్యకు ఆత్మీయులు. మద్రాసు వెళ్ళినపుడల్లా వీరిని చూచి వచ్చేవాడు. నరసయ్య మరొక మద్రాసు పరిచయస్థుడు సి.వి.చారి. ఈయనకు ఉత్తరాలు రాశాడు. నరసయ్య పెద్దన్న 'పార్థసారథయ్య' కుమారుడు ఆదెన్న, చిన్నన్న కృష్ణయ్య మద్రాసులో స్థిరపడ్డారు. వీరితో నరసయ్యకు సత్సంబంధాలున్నాయి.6

వెంకటగిరి జమీందారు రాజగోపాలకృష్ణ యాచేంద్రకు నరసయ్య ఇంగ్లీషు ట్యూటరుగా వ్యవహరించినా, ఆయనతో సంబంధాలు కొనసాగించలేదు. ఆయన తమ్ముళ్ళు ముద్దుకృష్ణయ్య, వెంకటకృష్ణయ్య, వేణుగోపాలయ్యలను కలుసుకొన్నట్లు, వారికి ఉత్తరాలు రాసినట్లు దినచర్యలలో పేర్కొన్నాడు. వెంకటగిరిలో ముద్దుకృష్ణయ్య నిర్వహిస్తున్న హైస్కూల్లో ఉపన్యసించిన వైనం దినచర్యలో ఉంది.7

కొందరు నెల్లూరు రంగనాయకుల పేట వైష్ణవ యువకులు నరసయ్య అభిమానులు, మిత్రులు అయ్యారు. ఈ యువకులు మద్రాసు చదువులకు వెళ్ళినపుడు ఆయనకు పరిచయం అయి ఉండాలి. నెల్లూరులోని వెంకటగిరిరాజా హైస్కూలు ఉపాధ్యాయుడు ఆసూరి సరస్వతీ నరసింహాచార్యులు నరసయ్య సన్నిహిత మిత్రుడు. ఈయన నెల్లూరు పురప్రముఖుడు, అమెట్యూర్ డ్రమెటిక్ అసోసియేషన్ (Amateur dramatic association) సభ్యుడు, నెల్లూరు ప్రోగ్రెసివ్ యూనియన్ (Progressive Union, Nellore) వ్యవస్థాపక సభ్యుడు. ఈయనను "My old friend" అని దినచర్యలో వర్ణించాడు. “My friend కొమాండూరు నరసింహాచార్లు” అని దినచర్యలో మరొక నరసింహాచార్యులను ప్రస్తావించాడు. ఈయన జిల్లా బోర్డు హైస్కూలు ప్రధాన అధ్యాపకుడుగా పనిచేశాడు. చక్కిరాల వెంకటసుబ్బయ్యతో కలిసి నెల్లూరు ఉత్తరభాగంలో ఒక పాఠశాల నెలకొల్పడానికి కృషిచేసినట్లు కూడా దినచర్యలో ఉంది.8

నరసయ్య నెల్లూరు స్నేహితులలో రంగమన్నారు అయ్యంగారు, చిలకపాటి రామానుజాచార్యులు, వెంకటేశయ్యరు, ఒంగోలు వెంకటరంగయ్య మొదలైన వారున్నారు. నరసయ్య కోడూరు నుంచి నవాబుపేట ఇంటికి వచ్చినపుడల్లా మిత్రులు వచ్చి కలిసేవారు. నెల్లూరులోని వేదం వేంకటరాయశాస్త్రి శిష్యవర్గంతో నరసయ్యకు పరిచయాలున్నాయి. నెల్లూరు పర్మనెంట్ ఫండ్ ఆఫీసు స్థాపకులలో ఒకరైన టి. సుబ్బులాలా నరసయ్య చిరకాల మిత్రుడు.9

నరసయ్యను "పుస్తకాల పురుగు” అని వర్ణించవచ్చు. పుస్తకపఠనం ఆయన వ్యసనం, ఆయన ప్రవృత్తి. పుస్తకంచేత పట్టుకొని, సాయంత్రం దీపాలు పెట్టినా ఏకాగ్రంగా పఠనం సాగించినట్లు దినచర్యలో పేర్కొన్నాడు. తనతో పాటు కుమారుడు రామకృష్ణయ్య కూడా గంటల తరబడి కదలకుండా చదువుతూ కూర్చొన్నట్లు దినచర్యలో రాశాడు.10