పుట:Endaro Wikimedianlu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వికీరాకెట్టు

మనం రోడ్డు పక్కన కాళ్ళీడ్చుకుంటూ నడుస్తూ పోతూంటాం. వెనకనుండి ఒక కారు 60 కి.మీ. వేగంతో మనల్ని దాటేసి దూసుకుపోయిందనుకోండి... అబ్బో భలే దూసుకుపోతున్నాడే అనుకుంటాం. ఆ వెంటనే ఒక రేసుకారు 300 కి.మీ. వేగంతో ఝప్ మని పోయిందనుకోండి... ఏమనుకుంటాం? ఏమీ అనుకోం... ఏం జరిగిందో అర్థం కాక, మ్రాన్పడిపోయి, నోరుతెరుచుకుని అలా చూస్తూండిపోతాం. మా బత్తిని వినయ్ కుమార్ గౌడ్ ఆ రేసుకారును మించినవాడు!

ఆయన తెవికీలోకి వచ్చి ఐదేళ్ళే అయింది. మొదటి రెండేళ్ళు పెద్దగా ఏమీ రాయలా. 2020 దాకా వినయం గానే ఉన్నాడు. :-) ఆ ఎవరో వినయ్ అంట... కొత్తగా వచ్చాడు, అనుకున్నాం. కౌంట్‌డౌన్ సమయంలో లాంచ్‌ప్యాడు మీద నిలబడ్డ ఇస్రో రాకెట్టు కూడా అలాగే ఉంటది - నిశ్శబ్దంగా, ఏదో తపస్సు చేసుకుంటున్నట్టు. ఇతను ఆ టైపని మాకు తెలీదప్పటికి. 2021 లో జూలు విదిల్చాడు. స్టార్టైన రాకెట్టు ఎలా వెళ్తుంది... గురి లక్ష్యమ్మీదే ఉంటది, పక్కచూపులుండవ్. కన్నుమూసి తెరిచేలోపు దూసుకుపోతుంది. వినయ్ కూడా అంతే.. మూడేళ్ళలో లక్ష దిద్దుబాట్లు దాటాడు. కొత్త వ్యాసాలు ఎన్ని రాసారో తెలుసాండీ… 8,425! క్షమించాలి... ఈ సంఖ్యలు, ఇది చెప్పడం మొదలుపెట్టే సమయానికండి... ఈ క్షణాన మా రాకెట్టు ఎక్కడుందో చెప్పలేం.

అసలు ఆ స్పీడేంటో గానీ... 2024 జనవరి నాటికి, 21 నెలల నుండీ... రోజుకు 10 కొత్త వ్యాసాల చొప్పున లెక్కపెట్టి మరీ రాస్తున్నాడు. ఏనాడూ 10 కి తగ్గలేదు. సృష్టించిన వ్యాసాల సంఖ్యలో అతనే తెవికీ ఫస్ట్. ఇస్రో

ఎందరో వికీమీడియన్లు

71