పుట:Endaro Wikimedianlu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లాస్టు కాదు లేటెస్టు

యూనివర్సిటీలో ఉద్యోగం నుండి రిటైరయ్యాక తెవికీలోకి వచ్చారు సుశీల గారు. 40 యేళ్ళ లైబ్రరీ ఉద్యోగానుభవాన్ని, దాదాపు 130 పరిశోధనా వ్యాసాల పరిణతినీ వెంటతీసుకు వచ్చారామె. దాంతో పాటు ఒక పాజిటివ్ ఎనర్జీని, ఒక కొత్త ఉత్సాహాన్నీ తీసుకొచ్చారు. వికీమీడియా ప్రాజెక్టుల్లో ఆమె చేస్తున్న కృషిని చూస్తే, అరెరె వికీ గురించి చాలా ఆలస్యంగా తెలుసుకున్నానే…, సరే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, ఇక వీటి సంగతి చూద్దాం అని నిశ్చయించుకున్నట్లు కనబడుతుంది. తెవికీతో పాటు, విక్షనరీ, వికీసోర్సు, వికీకోట్, వికీడేటా, ఎన్వికీ, కామన్సు, లింగా లిబ్రే… ఇలా అన్నిటిలోనూ కృషి చేయడం మొదలు పెట్టారు. క్రికెట్ 2023, విశాఖపట్నం వంటి వికీప్రాజెక్టుల్లో ఉత్సాహంగా పాల్గొని అనేక వ్యాసాలు రాసారు.

కాకతాళీయమో, ఆమె ప్రభావమో గానీ..., ఆమె వచ్చాక తెవికీలో మహిళల ప్రాతినిధ్యంలో పెరుగుదల కనిపించింది. తాను ముందుండి తోటివారిని ఉత్సాహపరుస్తూ ముందుకు సాగుతారామె. వికీల్లో కృషి మాత్రమే కాదు, వికీ బయట జరిగే కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకుంటారు. వికీకాన్ఫరెన్స్ ఇండియా, వికి విమెన్స్ క్యాంప్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాల్గొనడమే కాదు, అక్కడ ప్రెజెంటేషన్లు కూడా ఇచ్చారు. వికీబ్లాగు, డిఫ్‌లో కూడా రాసారు. తెవికీ తరఫున బయట కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్న వారిలో ఆమె ఒకరు. ఇన్ని చేస్తూ కూడా ఏమీ తెలియనట్లుగా ఉంటారామె - అన్నీ ఉన్న విస్తరిలాగ.

ఎందరో వికీమీడియన్లు

63