పుట:Endaro Wikimedianlu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సార్

ఏదైనా విషయంపై చర్చ జరుగుతున్నపుడు, చర్చ ఒక దిశలో జరుగుతుండగా ఒక ప్రత్యామ్నాయ దృక్కోణాన్ని చూపించగలవారు కొందరుంటారు. తెవికీలో అలాంటివారిలో కశ్యప్ ఒకరు. అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి గురించి అనేక సంవత్సరాలుగా పలువిధాల కృషి చేస్తున్న వ్యక్తి కశ్యప్ గారు. కశ్యప్ గారి మాట ఎంత వేగమో ఆయన చేసే పనులు కూడా అంతే వేగం. ముఖ్యంగా ఔట్‌రీచ్ కార్యక్రమాల్లో ఆయన త్రివిక్రముడి లాగా పనిచేస్తాడు. విజయవాడ, తిరుపతిల్లో తెవికీ ఉత్సవాలు జరిగినపుడు ఆయనే నిర్వాహక సంఘంలో చురుకైన కార్యకర్త, కోశాధికారి. ఈ-తెలుగు సంస్థను స్థాపించిన వారిలో ఆయనొకరు. ఆ సంస్థ తరఫున, పుస్తక ప్రదర్శనలో స్టాల్ పెట్టడంతో సహా పలు కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు వికీపీడియా వ్యాప్తి కోసం కూడా అలాంటి పలు కార్యక్రమాలు చేసారు. తెవికీ ప్రచారం కోసం పుస్తక ప్రదర్శనలో స్టాల్ పెట్టడం అనేది వాటిలో ఒకటి.

ఐఐఐటి సంస్థలో సంబంధిత విభాగంలో పనిచేస్తూ అన్నీ తానై నిర్వహించారు. పలు ఔత్సాహికులకు తెలుగు వికీపీడియాపై అవగాహన కలిగించడం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం చేసారు. మా వాళ్ళకి శిక్షణ కార్యక్రమం పెట్టాం, మీరు ఒక అంశం తీసుకుని మాట్లాడాలి అంటూ అనుభవజ్ఞులను ఫోన్లోనే ఆజ్ఞాపించగల చనువుంది, చొరవా ఉంది ఆయనకు. కొన్ని డజన్ల మంది ఆయన వద్ద వికీ శిక్షణ పొందారు. ఆయన శిక్షణలో రూపుదిద్దుకుని, తెవికీ అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతున్న వికీపీడియన్లు ఉన్నారు. కశ్యప్ సార్ అని వాళ్ళు అతన్ని ఆప్యాయంగా పిలుచుకుంటారు.

ఎందరో వికీమీడియన్లు

31