Jump to content

పుట:Endaro Wikimedianlu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముదితల్ నేర్పగ లేని విద్యగలదె

తెవికీలో ఒకప్పుడు మహిళలు రాసేవారు కాదు. అప్పుడు సుజాత గారు వచ్చారు. ఆ తరువాత చాన్నాళ్ల పాటు తెవికీలో ఆమె ఒక్కరే మహిళ. ఆ తరువాత విక్షనరీ లోనూ ఆమె ఒక్కరే మహిళ. విక్షనరీలోను, వికీపీడియా లోనూ ఆమె నిర్వాహకురాలు.

వికీలోకి వచ్చీ రాగానే ఆమెకు విక్షనరీ గురించి తెలిసింది, అక్కడికి వెళ్ళారు. విక్షనరీ గురించి తెలుసుకదండీ... స్వేచ్ఛగా వాడుకోగలిగే తెలుగు నిఘంటువు అన్నమాట. సుజాత గారు విక్షనరీని నడిపించడం కాదు, పరుగు పెట్టించారు. పదుల పేజీలను వందల్లోకి తీసుకువెళ్ళారు. వందలను వేలకు చేర్చారు. తాను స్వయంగా 7 వేలకు పైగా పదాలకు పేజీలను సృష్టించారు. 25 వేలకు పైగా దిద్దుబాట్లు చేసారు. విక్షనరీలో నిర్వాహకురాలు కూడాను.

విక్షనరీని హైవే ఎక్కించాక, ఆమె మళ్ళీ వికీపీడియా లోకి వచ్చారు. తెవికీలో ఆమె విరివిగా రాసిన తొలిమహిళే కాదు, ఏకైక నిర్వాహకురాలు కూడా. తెవికీలో అనేక దేశాల వ్యాసాల్లో సమాచారాన్ని నింపినది సుజాత గారే. అనేక దేశాలకు పేజీలు సృష్టించినదీ సుజాత గారే. దేశాలకు సంబంధించిన వందల పేజీల్లో లక్షల బైట్ల సమాచారం చేర్చారామె. అంతేకాదు వందలాది వైష్ణవ దివ్యదేశాలు, మహిళా శాస్త్రవేత్తల వ్యాసాలు రాసారు. వికీప్రాజెక్టులు నిర్వహించేవారు, చురుగ్గా పాల్గొనేవారు. అరకొర సమాచారంతో ఉండే వ్యాసాలు కనబడితే వాటిని పెంచి పెద్ద చేసేదాకా ఊరుకునేవారు కాదు. స్త్రీ సహజ గుణం మరి!

ఎందరో వికీమీడియన్లు

29