పుట:Endaro Wikimedianlu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలిసినవాళ్ళతో చేయిస్తాడు, కలసివచ్చేవాళ్ళు కనిపిస్తే భుజం కలిపి పనిచేస్తాడు, “మీరన్నది తప్పు” అని చెప్పాల్సివస్తే గౌరవంగా, నిక్కచ్చిగా చెప్తాడు, “నేను చేసింది తప్పు” అని ఒప్పుకోవాల్సి వస్తే నిస్సంకోచంగా ఒప్పుకుంటాడు, నేర్చుకుంటానంటే తనకొచ్చినదంతా నేర్పిస్తాడు, వీలైతే చిన్నవారి భుజాన కండువా వేసి వెనక నిలబడతాడు.

వికీలో జరిగేదంతా ఉమ్మడి కృషి కనుక ఘనత మొత్తం సముదాయానికే చెందాలి తప్ప వ్యక్తిగతంగా ప్రత్యేకతలు ఆపాదించకూడదన్నది చదువరికి ఉన్న నిశ్చితమైన అభిప్రాయాల్లో ఒకటి. తెవికీ అనే నదిలో అంతర్వాహినిలానే తానుండాలని అతని సంకల్పం. కానీ, కృషి, ప్రతిభ, పట్టుదల ఒకచోట రాశిపోసినప్పుడు ఆ వెలుగు జిగేలుమని చుట్టూ ఉన్నవారి దృష్టిని ఆకర్షించనివ్వకుండా ఆపడం ఎవరి తరం!

ఎందరో వికీమీడియన్లు

24