పుట:Endaro Wikimedianlu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆల్‌రౌండర్


ఒకే ఆటగాడు అద్భుతమైన బౌలింగూ, బ్రహ్మాండమైన బ్యాటింగూ చేస్తే ఆల్‌రౌండర్ అంటారు. అదే చేత్తో కళ్ళుచెదిరే ఫీల్డింగ్ కూడా చేస్తే ఏమనాలో తెలియక అవాక్కవుతారు. అదే మనిషి కెప్టెన్సీలోనూ రాణిస్తే? ఇన్నీ చేశాకా జట్టుకు అవసరమైనప్పుడు వికెట్ కీపింగ్ కూడా చేయగలిగితే. "అబ్బే! అలా చేయడం అసాధ్యం" అంటారు. కానీ, అలాంటి ఫీటే ఒక దశాబ్దం పైగా తెలుగు వికీపీడియాలో చేస్తున్న మనిషిని తెవికీలో అంతా "చదువరి" అంటారు. చదువరి ఆల్‌రౌండర్ మాత్రమే కాదు తెవికీ ఇన్నింగ్స్ లో అజేయంగా కొనసాగుతున్న ఓపెనింగ్ బ్యాట్స్‌మేన్. అతను వృత్తిరీత్యా ఇంజనీరు. ఏ పని తలకెత్తుకున్నా, దాని బరువు, వైశాల్యమూ, స్వరూపమూ, స్వభావమూ క్షుణ్ణంగా, వేగంగా అంచనా కట్టడం అతనికి వృత్తితో పట్టుబడ్డ విద్య. ఆ పనిని చివరిదాకా తీసుకెళ్ళే పట్టుదల మాత్రం అతనికి పుట్టిపెరిగిన మట్టి నుంచి వచ్చిందని వినికిడి.

తెవికీలో రాసేవారి సంఖ్య ద్విగుణం, త్రిగుణం, బహుళం కావాలనీ, వ్యాసాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగాలనీ అతని కోరిక. ఇదంతా జరిగేప్పుడు నాణ్యతలో ఏమాత్రం రాజీపడకూడదని అతని వ్రతం. చక్కని భాషలో వ్యాసాలన్నీ ఎదగాలని అతని కోరిక. వ్యాసాలు రాయడం ఎంత ముఖ్యమో, చర్చలు చేయడం, విధానాలు రూపొందించడం, అమలుచేయడం అంతే ముఖ్యమని అతని సూత్రం. దారేపోయేవారైనా సరే - తెలుగు వికీపీడియా వ్యాసాల్లో లోటుపాట్లు ఇవీ అని చీల్చిచెండాడి 'ఉన్న తప్పుల'న్నీ ఏకరువు పెట్టారనుకోండి, వాళ్ళు అతనికి పరమ ఆప్తులు అయిపోతారు. ఎందుకంటే, తప్పులేమిటో తెలిస్తే దిద్దుకోవచ్చన్నది అతని నమ్మిక. తెవికీకి అవసరమైనది ఏదైనా తనకు వస్తే చేసేస్తాడు, రాకపోతే నేర్చుకుంటాడు, వీలుకాకపోతే

ఎందరో వికీమీడియన్లు

23