పుట:Endaro Wikimedianlu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ్ఞానసముద్రుడు

ఆంధ్ర సాగర తీరం నుండి పసిఫిక్ సముద్ర తీరం దాకా విస్తరించిన విజ్ఞాన సముద్రం వేమూరి వెంకటేశ్వరరావు గారు. ప్రొఫెసరుగా, పరిశోధకుడిగా, శాస్తవేత్తగా, సైన్సు రచయితగా విస్తరించిన విజ్ఞాన వటవృక్షం ఆయన. సుప్రసిద్ధి చెందిన యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా విజయవంతమైన పరిశోధనా, వృత్తి జీవితాన్ని కలిగిన ఆయన తన అనుభవాన్ని, శాస్త్ర జ్ఞానాన్ని తెలుగులో విజ్ఞాన సృష్టికి వినియోగించాలని ఏనాడో నిశ్చయించుకున్నారు. సులువైన తెలుగులో సైన్సును పరిచయం చేస్తూ పుస్తకాలు రాసారు. ఇంగ్లీషు పదాలకు తేలికైన తెలుగు పదాలు సృష్టించిన ప్రత్యేకత ఆయనది. బణువు, చిణువు, వారసవాహిక... ఈ పేర్లన్నీ ఆయన సృష్టించినవే. అంతటి వేమూరి గారు కూడా వేమన చెప్పినట్లు కొంచెమై తెవికీ అద్దంలో ఒదిగిపోయారు. ఆయన తెలుగు వికీపీడియాలో కూడా కృషి చేయడం వికీపీడియాకూ వికీమీడియన్లకూ కలిగించిన గౌరవం.

తొట్ట తొలి వికీమీడియన్లలో ఆయనొకరు. తెవికీలో సృష్టించిన తొలి 20 వ్యాసాల్లో ఐదు వేమూరివన్ అన్న వాడుకరి పేరుతో ఆయన రాసినవే. కంప్యూటర్ హార్డ్‌వేరు గురించీ భూగర్భం గురించీ రాసారు, విభూతి గురించీ కారం గురించీ రాసారు. వ్యాసాల్లో భాష నాణ్యత గురించిన చర్చల్లో చురుగ్గా పాల్గొంటారు. తెలుగు వికీబుక్స్‌లో ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువులను కూర్చారు. తాను రామానుజన్ జీవితంపై రాసిన ఒక పుస్తకం ఎవరైనా, ఎందుకైనా వాడుకోవచ్చన్న లైసెన్సులో విడుదల చేసి వికీసోర్సులో పెట్టించారు.

ఎందరో వికీమీడియన్లు

17