పుట:Endaro Wikimedianlu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అసలు వికీపీడియా అంటే ఏమిటంటే...

తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు చాలా అరుదు. అందునా ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లాంటి బృహత్తర విజ్ఞాన సర్వస్వం అసలు లేనేలేదు. సాహిత్య అకాడమీ ప్రచురించిన విజ్ఞాన సర్వస్వం ఉన్నా, అది సాహిత్య విషయాలకే పరిమితమైంది. ఉన్న కొద్దీ కూడా పెద్ద పెద్ద గ్రంథాలయాలలోనే లభ్యం. ఆవకాయ నుండి అంతరిక్షం దాకా, అటుకుల దగ్గర నుండి అణుబాంబు దాకా ప్రతీ విషయాన్ని వివరిస్తూ సాగే విశాల, విశిష్ట, విజ్ఞాన సర్వస్వాన్ని తయారుచెయ్యడమంటే మామూలు విషయం కాదు. అపార ధనవ్యయం, అశేషమైన పనిగంటలు, అనంతమైన పరిశోధన కావాలి. సకల వనరులూ ఉన్న ప్రభుత్వమో, డబ్బును గుమ్మరించగల పోషకులో పూనుకుంటే తప్ప, ఇలాంటి మహత్కార్యాలు సాధ్యం కావు. అటువంటి బృహత్కార్యాన్ని సాధించేందుకు నడుం కట్టారు, తెలుగువారు. ఐతే ఈ పనికి పూనుకున్నది ప్రభుత్వమో, విశ్వవిద్యాలయమో కాదు. కేవలం మనలాంటి సామాన్యులే భుజం భుజం కలిపి ఈ పని చేస్తున్నారు. కొన్నివందల మంది ఉత్సాహవంతులు నిరంతరం శ్రమిస్తూ కోట్ల మందికి ఉపయోగపడగల ఒక విజ్ఞాన కోశాన్ని తయారు చేస్తున్నారు. ఇంతకీ ఏమిటీ విజ్ఞాన కోశం? ఎక్కడ రాస్తున్నారు, ఎవరు రాస్తున్నారు?

అప్పుడెప్పుడో 2001లో మొదలైంది ఈ కథ. లోకంలోని విజ్ఞానాన్నంతటినీ ఒకచోట చేర్చి ప్రజలంతా స్వేచ్ఛగా వాడుకునే వీలు కల్పించాలనే సంకల్పంతో మొదలైంది. ఎక్కడుంది ఈ విజ్ఞానం.. భాండాగారాల్లో ఉంది, సైన్సు పేపర్లలో ఉంది, పుస్తకాల్లో ఉంది, వార్తా పత్రికల్లో ఉంది, పెద్దపెద్ద సర్వర్లలో ఉంది, పర్సనల్ కంప్యూటర్లలో ఉంది, మెమరీ చిప్‌లలో ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ కొందరో అందుకోగలిగే తావుల్లో ఉంది. దీన్నంతటినీ ఎలా తెస్తారు? ఎవరు తెస్తారు? ఎక్కడ పెడతారు?

ఎందరో వికీమీడియన్లు

IX