పుట:Ecchini-Kumari1919.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

ఇచ్చనీ కు మారి

అమరసింహా! మ మ్మేల బలాత్కరింతువు! మాభీమన్న ప్రవర్తన మాలోచింప మా కతనియుం దించుకేనియు నమ్మకము వొడమకున్నది. ఏదో యొకమూలఁ బడి బ్రతుకుచున్న మ మ్మిట్లు బ్రతుకనిమ్ము' అని పలికిరి.

అది విని యమరసింహుఁడు 'రాజకుమారులారా! మీ రన్నది నేను కాదనను. భీముని వెనుకటివర్తన మరయ మీ రట్టి దురభిప్రాయము నొందుట తప్పుగాదు. ఇదిగో! దైవసాక్షిగాఁ బల్కుచున్నాను వినుఁడు. భీమదేవుఁడు మి మ్మాదరించుట కాటంక మేమియును లేదు. అతనివలన మీ కగౌరవముగాని, యపాయముగాని సంభవించిన నాప్రాణముల నిచ్చియైనను దప్పించెదను. మీ కేమయిన ననుమాన మున్నచో మీలో నొకరు నాతో ఘూర్జరదేశమునకు వచ్చునది. ఈ విషయమై భీమున కెంత పశ్చాత్తాపమున్నదో తెలిసికొనునది. మీ కతనియందు నమ్మకము గల్గినచో వచ్చి యతనిఁ జేరుఁడు, లేనిచో మీయిష్టమువచ్చినట్లు నడవుఁడు. మఱియొక సమాచారము, నే నిట్లనుచున్నానని కోపింపకుఁడు. అయ్యా! మీరు రాజపుత్రులు గారా? మీకుఁ బౌరుషము లేదా? బుద్ధిపూర్వకముగా మీ కపచార మొనర్చిన యీరాజును సేవించుట కష్టమనిపింపలేదా? భీముఁడుకూడ మీ కపకారియే కానిండు. అయినను, మీరంద ఱొకకుటుంబములోనివారు. మీలో మీ రేమనుకొన్నను దప్పుకాదు. ఇంతకును గృతమునకై భీముఁడు పశ్చాత్తాపము నొందుచునే