పుట:Dvipada-basavapuraanamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xlvii

గీర్తించిరి. కర్ణాటకవి చరిత్రకారు లితనికి “ప్రత్యక్షభృంగీశావతార" "తత్త్వ విద్యాకలాప" "అన్యవాదకోలాహల" "కవితాసార" మున్నగు బిరుదము లున్నట్లు చెప్పిరి. పై బిరుదము లన్నియు సోమనాథుని సమగ్ర వీరశైప జీవితమును వ్యజించుచున్నవి.

వీరశైవ వాఙ్మయము మహనీయ మయ్యును పరమత దూషణ మా కృతులలోఁ గొన్ని యెడల నవధి మీరి యుండుటచే నా మతస్థుల కది మోదాపహ మయ్యు సర్వజనా మోదదాయకము మాత్రము కాఁజాలక పోయినది. అందువలననే సోమనాథుని కావ్యగుణములు మెచ్చుకొని తమ రచనలలో నచ్చుపడునట్లు వానినిఁ బాటించిన పలువు రాంధ్రకవు లాతనిని బాహాటముగా స్తుతించుటకు మాత్రము ముందుకు రాలేదు. నవ్యులగు విమర్శకు లాతని మతదృష్టిపైఁగాక సాహిత్య దృష్టిపైనను, భాషాదిశాస్త్ర, దృష్టిపైనను తమ పరిశోధనలను కేంద్రీకరించిరి. దేశిమార్గాచార్యుఁ డైన సోమనాథుఁడు ఒక సాహిత్య సంప్రదాయ స్రవంతికి భగీరథకల్పుఁ డై పండితుల భక్తిపూజల నందుకొనుచున్నా డు.

పాల్కురికి సోమనాథుని సాహిత్యముపై మౌలికమైన విమర్శనలు జరిపిన మహనీయులు తెలుఁగు దేశమునఁ బెక్కండ్రు కలరు. వారిలో శ్రీయుతులు బండారు తమ్మయ్య, వేటూరి ప్రభాకరశాస్త్రి, చిలుకూరి నారాయణరావు, నిడుదవోలు వేంకటరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, కాశీనాథుని నాగేశ్వరరావుగారల వంటి పండితులు ఈ సందర్భమున ప్రధానముగా స్మరింపఁదగినవారు. వీరేశ లింగముపంతులుగారి నుండి ఆరుద్రగారి వఱకు నున్న వాఙ్మయ చరిత్రకారులును, బ్రౌను దొరగారినుండి వీరశైవ సాహిత్యముపై వ్యాసములు వ్రాయుచున్న సాహిత్య విమర్శకులును. చిలుకూరి వీరభద్రరావుగారు మొదలగు దేశచరిత్ర రచయితలును. ఈ కవినిగూర్చి ప్రశంసించినవారే.

సంక్షిప్తప్రతి :

ఇట్టి పాల్కురికి సోమనాథుని బసవపురాణమును మొదట క్రీ. శ. 1896 లో " ఏలూరు వాస్తవ్యులు శ్రీ కందుకూరి శ్రీశైల వీరభద్రపరప్రసాదరావుగారు ప్రచురించిరి. ఆ పైన 1926 లో నది శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారిచే బరిష్కరింపఁబడి శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావుగారిచేఁ బ్రచురింపఁబడినది. దాని ద్వితీయముద్రణప్రతిని శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు పరిష్కరించిరి. 1952 లో శ్రీ బండారు తమ్మయ్యగారు బరిష్కరించిన బసవపురాణము శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులగారిచేఁ బ్రకటింపఁబడినది,

ఈ నడుమ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీవారు ప్రసిద్ధ మహాకావ్యములఁ గొన్నింటికి సంక్షిప్తప్రతులను సిద్ధము చేయించి, ప్రచురించి, ప్రజల కందుబాటులో నుండు సరసమైన ధరలకు వాని నందింపవలె నని తల