పుట:Dvipada-basavapuraanamu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xlviii

పెట్టిన కార్యక్రమములో బసవపురాణ సంక్షిప్తప్రతిని సిధ్ధము చేసి, పీఠికను పొందుపఱచు భారము నాపై నుంచినారు. శక్తి చాలని వాఁడ నయ్యు సాహిత్యముపై నున్న భక్తిచే నే నీ గురుతర మైన బాధ్యత నంగీకరించితిని. ఈ సంక్షిప్త ప్రతి కాధార మైనది శ్రీ బండారు తమ్మయ్యగారిచేఁ బరిష్కృతమై వావిళ్లవారిచే క్రీ. శ. 1966లోఁ బ్రచురితమైన ముద్రిత ప్రతి. అందలి 12610 ద్విపద పంక్తులలో 5380 పంక్తులను తగ్గించి, 7230 ద్విపద పంక్తులతో నీ సంక్షిప్త ప్రతిని సిద్ధపఱచుట యైనది. ఈ సంక్షిప్త బసవపురాణమున బసవేశ్వరుని చరిత్రమును, అతని సహచరులును, సమకాలీనులు నైన భక్తుల చరిత్రము యథాతథములుగా. నుంచఁబడినవి. దృష్టాంతరూపమున జెప్పఁబడిన ప్రాచీన భ క్తులకథలలో వస్తుతత్త్వము చెడకుండ , కథాసంవిధానము కుంటువడకుండ కొన్ని కథలను తీసివేయుట జరిగినది. అచ్చటచ్చట దీర్ఘములైన వర్ణనములను తగ్గించుట యైనది. కావున నీ సంక్షిప్తప్రతిలో సోమనాథుని బసవపురాణ ప్రధాన ప్రతిపాద్యవస్తువు చెక్కుచెదరక యున్న దని చెప్ప వచ్చును. సంక్షిప్త మొనర్చిన భాగమును "*"- గుర్తులతో నిందు సూచించుట యైనది. శ్రీ బండారు తమ్మయ్యగారు పైముద్రితప్రతిలో పొందుపఱచియున్న 'అర్ధవివరణ పట్టిక ' లోని యర్ధములను గైకొని పాఠకసౌకర్యార్థ మీ గ్రంథమున నథస్చూచికలలో నందించుట యైనది. విరామచిహ్నములఁ గూర్చుట యైనది. శ్రీ తమ్మయ్యగారి కందులకు నాకృతజ్ఞతలు, పండితప్రకాండు లెందఱో కృషిచేసిన సోమనాధుని సాహిత్యక్షేత్రమున వారి బాటలలోనే వారి మాటలలోనే నేనును నడచియు, సోమనాథుని బసవపురాణ సంవిధానమున దేశిపురాణ సంప్రదాయము కలదని కొంత స్వతంత్రించి నిరూపించుటకు యత్నించితిని. విజ్ఞులు దీనిని సహృదయభావముతో గ్రహింతు రని నమ్ముచున్నాను. నే నీ పీఠిక లో సోమనాథుని గూర్చి వ్రాసినదానికంటె వ్రాయక మిగిలినదే యధికముగా నున్నది : క్షయము లేని కళాపూర్ణుఁడీ సోముఁడు! అతనినిగూర్చి యెంత వ్రాసిసను చంద్రుని కొక నూలుపోగు సామెతకే వచ్చును !

నా కీసదవకాశము కల్పించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారికిని, ప్రత్యేకముగా అకాడమీ కార్యదర్శులును, విద్వజ్జన పక్షపాతులును, సాహిత్యసేవాధురంధరులు నైన శ్రీ దేవులపల్లి రామానుజరావుగారికిని నా హృదయపూర్వక కృతజ్ఞతా వందనములు !

హైదరాబాదు

1 - 1 - 1969

గూడ వేంకట సుబ్రహ్మణ్యం