పుట:Dvipada-basavapuraanamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxv

ఉఱుకురికి యని వ్యవహరింపఁబడుచున్నట్లు శాసనాధారము లుండుటచే[1] పాలకుర్తియు నాకాలమున పాలకురికి యని పిలువఁబడుచుండె నని భావింప వీలగు చున్నది. ఇవి యిట్లుండ దేశిమార్గ పురాణధ్వజము లెదురెదురుగా నిలువఁబెట్టిన సోమనాథమారనలు ఓరుగల్లు ప్రాంతమువా రనుటయే సంభావ్యము !

శ్రీ నిడుదవోలు వేంకటరాపుగా కన్నట్లు:- “ఇంతకు సోమనాథుఁడు కన్నడదేశమున తెనుఁగుదేశమున కంటె విశేష ప్రసిద్ధి గడించిన వాఁడుకదా ! అతని నెందరో కన్నడకవులు స్తుతియించి యున్నారు. అతఁడు నిజముగా కన్నడదేశస్ధ మైన హాల్కురికి గ్రామనివాసి యైనచో నొక్కకవి యైన యాతని పాల్కురికి సోమనాథుఁ డని పేర్కొనలేదు. ఇది యొకటియే యతఁ డాప్రాంతమువాఁడు కాఁడని నిర్ణయించు చున్నది...మఱియు సోమనాథుఁడు తొలుత గోదావరీ మండలమున దాక్షారామ నివాసి యగు మల్లికార్జున పండితుని సంప్రదాయము వాఁడు. కన్నడదేశమున ప్రసిద్ధి నొందిన బసవని వృత్తాంతమే తెలియనివాఁడు సోమనాథుఁడు. కన్నడదేశమున హాల్కురికి వాస్తవ్యుఁ డైనచో బసవని చరిత్ర నాతఁ డితరులవలన తెలిసికొన నగత్యము లేదు. అతఁడు కన్నడభాషలోనే బసవపురాణము వ్రాసియుండునుగాని, తెనుఁగుభాషలో మొదట వ్రాసియుండఁడు...ఆవెనుక కన్నడభాషలోనికి ననువదింపఁబడుటయు గూడ పాల్కుఱికి వాదమునే బలపఱచుచున్నది."[2]

కులగోత్రాదులు :

సోమనాథుఁడు పాలకురికి గ్రామమున శ్రియాదేవియు, విష్ణురామిదేవుఁడు నను బ్రాహ్మణదంపతులకు జన్మించిన పుణ్యమూర్తి. ఇహపర సుఖ సిద్ధిని గోరి ద్విపదలో బసవపురాణము రచించుచు నందు తన మాతాపితరులను బేర్కొని[3]

  1. "రెండు పాడ్లు ఎలకుర్కి ప్రసన్న విశ్వేశ్వర దేవరకు సమర్పించినందుల విని యోగము భోగము వారు...."..... కాకతీయ రుద్రదేవుని ధర్మసాగరశాసనము. “శ్రీచౌండ సైన్యపతి రారవీండుతారం గ్రామం సమగ్రమ ప......న్నుఱక్కుఱ్కి సౌంజ్ఞాం..." ... గణపతిదేవుని కొండిపర్తి శాసనము, శా.శ. 1136. చూడు: బసవపురాణ పీఠిక శ్రీ బండారు తమ్మయ్యగారు. పుట, 25-26.
  2. తెనుఁగుకవుల చరిత్ర, (మదరాసు విశ్వవిద్యాలయ ప్రచురణ, 1953)వుట. 313.
  3. భ్రాజిష్ణుఁ డగు విష్ణురామిదేవుండు దేజిష్ణువగు శ్రియాదేవి యమ్మయును గారవింపఁగ నొప్పు గాదిలి సుతుఁడః", బి. పు. (సంక్షిప్తము) 1. 151-152.