పుట:Dvipada-basavapuraanamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxiv

జన్మస్థాన మనియు విమర్శకులు గాఢముగా విశ్వసించుచున్నారు. కాని కీ. శే. చిలుకూరి నారాయణరావు పంతులుగారు మైసూరు రాష్ట్రమున తుముకూరు జిల్లాలో నున్న “హాలకురికె" యనుగ్రామమే "పాలకురికి" యై యుండవచ్చు ననియు, కన్నడమునందలి "హ" వర్ణము తెనుఁగున

"ప" గా మారుట సహజ మనియుఁ, బేర్కొని యుండిరి. [1] కర్ణాటకవి చరిత్రకర్త లగు శ్రీ నరసింహాచార్యులుగారును , కన్నడ సారస్వత (Kanarese Literature) మను గ్రంథమును రచించిన రైసుదొరగారును పాలకురికి గోదావరి జిల్లాలో నున్న దని యూహించిరి. ఈ రెండు వాదములును నేఁ డంగీకరింపఁబడుటలేదు. పై పాలకురికి తెలఁగాణము నందున్నదే యని నిశ్చయించుటకు తోంటద సిద్ధలింగకవి సోమేశ్వర పురాణమును, అన్యవాదకోలాహల శతకమును, ప్రతాప చరిత్రమును , పిడుపర్తి సోమనాథుని బసవపురాణమును[2] జెప్పెడి మాటలు తోడు పడుచున్నవి. ఇంకను పాలకుర్తి లో వెలసియున్న స్వయంభు వగు సోమేశ్వరుని యాలయము. సోమనాథుని యాశ్రమస్థలి (సమాధి ?) పై - నతని శిష్యులచే స్థాపింపఁబడిన 'సోమనాథుని లింగము, ' సాక్ష్యము పలుకుచున్నవి. పాలకుర్తి ప్రసిద్ధ శైవక్షేత్ర మగుటయు, బసవపురా ణావతారికలోఁ బేర్కొనఁబడిన కట్టకూరి పోతిదేవర నివాసస్థల మగు కట్టకూరు పాలకురికి సమీపముననే యుండుటయు నీ వాదమునకు బలము చేకూర్చు చున్నవి. నేటి పాలకుర్తికి సమీపమున నున్న ఎలకుర్తి, ఉఱుకుర్తి యను గ్రామములు కాకతీయుల కాలమున ఎలకురికి,

  1. పండితారాధ్య చరిత్ర (ఆంధ్రగ్రంథమాల) పీఠిక. పుట 1-7. వీరి వాదము ననుసరించిన వారిలోఁ బ్రముఖులు శ్రీ చాగంటి శేషయ్యగారు. చూడు : కవితరంగిణి సంపు. 3. 117-119.
  2. “పిడుపర్తి బసవన బసవపురాణమున నీవిషయము గానరా దని కొంద ఱనవచ్చును. అందు "కలిమలభంగచంగ శివగంగకు? జెంగటఁ గల్కెమన్పురిన్ " అనియుండ వలసినచోట నచ్చుతప్పు, “శివగంగకు: జెంగటఁ గల్గుమత్పురిన్ " అని పడిన దని కీ. శే. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు బసవపురాణ పీఠికాధస్సూచికలో పేర్కొనిరి. (పుట, 8); అంతియకాక పైనఁ బేర్కొనఁబడిన యైతిహ్య మోరుగల్లున జరిగినదనియు, శివభక్తు లోరుగంటికి తత్సమీపగత మగు పాలకురికి నుండి పాల్కురికి సొమనాథుని బిలుచుకొని వచ్చి రనియు స్పష్ట మగుచున్నది.