పుట:Dvipada-basavapuraanamu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

బసవపురాణము

గరతలాంగుళములఁ గనుఱెప్ప లెత్తి
“నెర సున్న' దని పాఱనిష్ఠించి యూఁదుఁ ;
బరగ నాలుక గ్రుడ్డుపైఁ ద్రిప్పి త్రిప్పి
యొరయుచు నొరయుచు నొయ్యనఁ జూచుఁ ;
జీరావిఁగొని కంటఁజేర్చి హత్తించి
చీరెల్లఁ దడిసినఁ జిక్కు : వెండియును 1030
నీకడకంట వ్రేలిడి యొత్తనొత్త
నాకడకంట ధారావలి వర్వె:
నాకడకంట వ్రే లదుమ న ట్లదుమ
నీకడకంట నీరెంతయుఁ దొరిగెఁ;
గొలుకులురెండు నంగుళముల నదుమఁ
గలయఁగఁ గన్నెల్లఁ గొలుకులై కాఱె ;
నక్కన్నుఁ గొలుకులు నరచేతమూయఁ
బక్కిళ్లఁ బింజించి పాఱంగఁ దొడఁగె ;
నెట్టును నేత్రాశ్రు లెడతెగకున్న
నెట్టణ దుఃఖించి బిట్టు వాచఱచు ; 1040
నడుగులఁ బడి ంమ్రొక్కు ; నంజలి యొగ్గు ;
నడలు ; నిల్చును; నిల్వఁబడు ; లేచుఁ : జూచుఁ ;
'కటకటా!' యనుచు లింగముఁ జుట్టిచుట్టి
యటయిట యేఁగుచునా త్మలోపలను
“నానందబాష్పమ్ము లంద మేనియును
నాననంబునఁ దోఁప దానందచిహ్న ;
సారకటాక్ష వీక్షణ జాల మైనఁ
గారుణ్య జలములు గావ యుష్ణములు ;
ఘర్మజలంబులక్రమ మందమేని
ఘర్మజలంబులు గన్నులఁ గలవె ? 1050
యొండు దుఃఖం బేని యూహించి చూడ
రెండుగన్నులఁ గాఱ కుండునే నీరు ?
తా నొక్కకంటనె ధార వర్వెడిని