పుట:Dvipada-basavapuraanamu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

బసవపురాణము

భంగి జలంబులుఁ బత్తిరి బ్రుంగి
మంగళం బై యొప్పె మఱియట్లుఁ గాక
తలగంగ నతనిపాదహతిఁ దొలంకి
యలరి పాదోదకం బై వెల్లివిరియఁ 970
బొలుపుగఁ గన్నప్ప పుక్కిటనీరు
గలయఁ బ్రసాదోదకం బయి తనర
నాలింగమూర్తి యపాంగోదకముల
పోల లింగోదకపూర మై తనరఁ
ద్రివిధోదకంబులుఁ ద్రినయను మేనఁ
బ్రవిమలం బై యిట్లు భ్రాజిల్లె ; నంతఁ
దవిలి ప్రసాదికిఁ ద్రివిధోదకములు
ప్రవిమలమతిఁ బొందఁ బాడి యనంగ
సర్వాంగములుగూడ జలములు వర్వ
సర్వేశుభక్తుఁ డాశ్చర్యంబు నొంది 980
యగ్గలం బయ్యె నపాంగాశ్రు లనుచు
బెగ్గిలి నేత్రమ్ము దగ్గఱి చూచి
“కటకటా ! యిదియేమి గర్జంబు పుట్టె ?
నిటలాక్ష ! నీకంట నీరు గాఱెడిని;
నీనింద విని గౌరి నీఱైన నాఁడు
దా నించు కేనియుఁ దడి గంట లేదు;
జనకునిచేఁ దనయునిఁ దునిమించునపుడు
కనికరంబున గంటఁ గ్రమ్మదు నీరు ;
చీర సించుచు విప్రు లాఱడి వైచి
కారించుతఱి నుదకము లేదు గంట ; 990
నాఱాల వాట్లు ఱివ్వనఁ దాఁకునొవ్విఁ
గాఱవు నాఁడును గంటఁ బాష్పములు ;
పరసతికై పట్టువడ్డ భంగమునఁ
దొరుగవు నాఁడును దోయముల్ గంట ;
వెట్టి కేఁగెడు తట్టఁ బట్టి యెత్తుడును