పుట:Dvipada-Bagavathamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హరికి యిక్కడివార్త లందెనో! నడుమ
దిరిగెనో! శౌరిఁ దోతెచ్చుచున్నాఁడొ!
ఈకార్య మెఱిఁగింప నిందిరావిభుఁడు
కైకొనకుండునో! కడువేడ్కతోడ
వచ్చునో! ఎవ్వరే వలదందురొక్కొ!
మచ్చికతో నన్ను మన్నించునొక్కొ!
నెడమకన్నును జన్ను నేడమభుజంబు
వడి నదరెడి హరివచ్చు నిశ్చయము.”
అని యిచ్చ నూహింప నంబుజోదరుఁడు
చనుదెంచి సీరితో సైన్యంబుతోడ
నాపురోద్యానంబు నందొప్ప విడిసి
భూపాలతనయ కింపుగఁ దనరాకఁ80
జెప్పి పుంచినఁ జెన్నార విప్రుఁ
డప్పొలంతుకఁ గాంచి హరి వచ్చె ననుడు
హరుషాశ్రువులు గ్రమ్మ నందంద మేను
గరుపార నవ్విప్రుఁ గని యిట్టులనియె,
“పురుషార్థపరుఁడవు పుణ్యచిత్తుఁడవు
పరమాప్తుఁడవు నాకుఁ బ్రాణంబు నీవ!
ప్రాణవల్లభుఁడైనఁ బద్మాక్షుఁ దెచ్చి
ప్రాణంబుఁ గాచితి పలుకులిం కేల!”
అని పల్కి యతనికి నందంద మ్రొక్కి
కనకాంబరము లిచ్చి ఘనతతో ననిచె.

రుక్మిణి గౌరియాలయమునకు వెడలుట


గౌరికి మ్రొక్కింపఁ గరము సంప్రీతి