"మన్దిపాయ్ వడవేంగడమామలై;వానవర్ శన్దిశెయ్య నిన్ఱాన్" అంటూ తిరుప్పాణి ఆళ్వార్ జ్ఞానులు అజ్ఞానులు అనుభేదం లేక ఊర్ధ్వలోక వాసులు భూలోకవాసులు సేవించునట్లు దయార్ద్రహృదయుడైన స్వామి తిరువేంగడమున వేంచేసియున్నాడు అని అభివర్ణించిరి.
తిరుమంగై ఆళ్వార్లును "తిరువేంగడ ముడై నెంజమే" ఓ మనస్సా ! తిరువేంగడమును ఆశ్రయింపుమని భావించి; "నాయేన్ వన్దడైన్దేన్ నల్గియాళైన్నై క్కొణ్డరుళే" అంతట సంచరించి అన్నిబాధలను అనుభవించి అగతికుడనై నిహీన జంతువువలె నీసన్నిధికి వచ్చి నిన్ను ఆశ్రయించితిని. ఆదరముతో నన్ను అనుగ్రహింపుము అని దీనంగా ప్రార్దిస్తారు. (పెరియతిరుమొழி)
ఆచార్యుల అనుభవాలలో తిరుమల
భగవద్రామానుజులకు ఆచార్యులైన పెరియ తిరుమల నంబిగారు తమ ఆచార్యులైన ఆళవన్దారుల ఆదేశానుసారం ఇక్కడే వేంచేసియుండి తీర్థకైంకర్యంతో పాటు అనేక కైంకర్యాలను స్వామి సన్నిధిలో చేయుచుండెడివారు. ఒక నాడు వీరు పాపనాశనం నుండి తిరుమంజనం తీర్థం తెచ్చుచుండగా స్వామి మారువేషంలో వచ్చి "తాతా! దాహంగా ఉంది కాస్త తీర్థం ఇవ్వవూ" అని ప్రార్థించి వీరొసంగిన తీర్థం కడుపార త్రావి నిజరూపంతో సాక్షాత్కరించాడు. కావుననే వీరిని "పితామహస్యాపి పితామహాయ" అంటారు సంప్రదాయ వేత్తలు (అహంహి సర్వలోకానాం మాతాథాతా పితామహ:అని చెప్పిన సర్వేశ్వరునిచే "తాతా" అని పిలువబడుటచే పితామహునకు కూడ పితామహుడై నారు)
తిరుమలై అనన్దాళ్వాన్ అను మహనీయులు రామానుజుల వారి శిష్యులు. వీరు ఆచార్యాజ్ఞను శిరసావహించి తిరుమలైలో వేంచేసి యుండి నందనవనమును పెంచి పెరుమాళ్లకు పుష్ప కైంకర్యము చేసెడివారు. ఆవనమునకు "రాషూనుశన్" అనిపేరు. వీరు ఆనాడు పెంచి పోషించిన నన్దనవనం నేటికిని అనన్తాళ్వాన్ తోటగా ప్రసిద్దమై నానాపుష్పలతా గుల్మతరుశోబితమై అలరారు చున్నది. వీరి యీ కైంకర్యమునకు సంతసించిన భగవద్రామానుజులు వీరిని "అనన్దాన్ పిళ్ళై" అని అనేవారట. ఒక పర్యాయం పద్మావతీ శ్రీనివాసులు రాజకుమారిక రాజకుమారుల వేషంలో అనన్దాళ్వాన్ తోటలోని పుష్పములను కోసికొని అలంకరించుకొంటున్నారు. ఇంతలో అనన్దాళ్వాన్ రావడం చూచి వారు సన్నిధికి అప్రదక్షిణంగా పరుగెత్తి ఉద్యానవనం దగ్గర అంతర్థానమై నారట. దీనికి సూచకంగా బ్రహ్మోత్సవాలలో ఏడవరోజు స్వామివారు అప్రదక్షిణంగా ఉద్యానవనంలోనికి వేంచేస్తారట.
120