పుట:DivyaDesaPrakasika.djvu/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

59. తిరువనంతపురమ్‌ 1

శ్లో. తిరువనంత పురే భుజగేశయో రుచిరమత్స్య సరోవర సుందరే|
   శశి విభూషణ వజ్రధరేక్షిత శ్శఠరిపూత్తమ సూరి పరిష్కృత:||
   అనంత పద్మనాభ శ్శ్రీహరి:లక్ష్మీ సమన్విత:|
   ద్వారత్రయేణ సంసేవ్య: హేమ కూట విమానగ:||

వివ: అనంత పద్మనాభస్వామి-శ్రీహరిలక్ష్మీతాయార్-భుజంగశయనం-మత్స్య పుష్కరిణి-హేమకూట విమానము-తూర్పు ముఖము-మూడు ద్వారములలో దర్శనము-శివునకు, ఇంద్రునకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్లు కీర్తించినది.

విశే: ఇది కేరళ రాష్ట్ర ముఖ్య పట్టణము. సన్నిధి కోట మధ్య భాగమున కలదు. ఇచట స్వామి మూడు ద్వారములలో సేవ సౌదింతురు. ఈ స్వామి విషయమై నమ్మాళ్వార్లు తమ తిరువాయిమొழி ప్రబంధములో(10-2)"అరవిల్ పళ్లి పైన్ఱవన్ పాతజ్గాణ నడుమినో సమర్‌ కళుళ్లీర్" భాగవతులారా! అనంతునిపై పవళించియున్న పద్మనాభ స్వామి శ్రీపాదములను సేవింప బయలుదేరుడు" అని యుపదేశించియున్నారు.

శ్రీరంగమున అధ్యయనోత్సవమున అరయరులు ఈ పాశురమును గానము చేయగా విని ఆళవందార్లు ఆనందపరవశులై ఆళ్వార్లు పిలిచిన ఈ క్షేత్రమునకు పోయిరావలయునని వెంటనే తిరువనంతపురమునకు వేంచేసిరి.

"కురుగైక్కావలప్పన్" అనువారు ఆళ్వందార్లకు యోగరహస్యములను ఉపదేశింప దలచి ఒక సుముహూర్తమును నిర్ణయించిరి. కాని ఆళవందార్లు ఆదినమున తిరువనంతపురములో వేంచేసియుండిరి. ఆకారణమున యోగరహస్యము వారికి లభింపకపోయెనట. "అయ్యో! పుష్పక విమానమైనను లేదే. ఉన్నచో కురుగైక్కావలప్పన్ సన్నిధికి చేరి యోగరహస్యములను పొంది యుండు వారమే" యని భావించిరట.

ఈక్షేత్రమున సేవింపవలసిన విశేషములు పెక్కులు గలవు.ఇచటికి సమీపమునగల "యానైమలై", అగస్త్య పర్వతము, ఏలకకాయల కొండ చూడదగినవి.

ఆచార్య హృదయములోని "ససైన్య పుత్ర శిష్య సాధ్య సిద్ధ భూసురార్చనత్తుక్కు ముఖ, నాభి పాదజ్గళై ద్వారత్రయత్తాలే కాట్టుం సామ్యమ్‌ అనన్త శయనత్తిలే వ్యక్తమ్" అనుచూర్ణిక "సైన్య, పుత్ర, శిష్య సాధ్య, సిద్ధ బ్రాహ్మణారాధనలకు అనుకూలముగా ముఖము, నాభి, పాదములతో మూడు ద్వారములందు సేవసాదించు సౌమ్యగుణము (ఎల్లరును ఒక్కరీతిని జూచు గుణము) తిరువనంత పురమున కనిపించును అని తెలుపుచున్నది. 75