పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీతిప్రకాశిక

దీనికే వైశంపాయననీతి యని నామాంతరము. ఇది యెనిమిదధ్యాయములు గలది.

తొలుత బ్రహ్మ పృథుచక్రవర్తి కుపదేశించిన ధనుర్వేదమును వైశంపాయనుఁడు జనమేజయున కుపదేశించినట్లు గ్రంథావతారణిక ప్రథమాధ్యాయమున గలిదోషములు రాజనీతిమున్నగు విషయములు శత్రుపై దాడి వెడలుటకుఁ బూర్వము సంసిద్ధుఁడై యుండవలసిన తీరులు గలవు.

ద్వితీయాధ్యాయమున జయప్రదములైన ధనుర్వేదోక్తములైన యాయుధములు ముక్తక అముక్తక ముక్తాముక్తక మంత్రముక్తకము లని నాల్గు తెఱఁగులనియు ధనుర్వేద ప్రథమపాదమున సూచితములగు ధనురాది ద్వాదశాయుధములు మొదటిరకములనియు, ద్వితీయపాదమునఁ జెప్పబడిన యిర్వది యాయుధములు రెండవరకమనియు, తృతీయపాదమునవి మూఁడవరకపుటాయుధములనియు నవి నలువదినాలుగనియు సోపసంహారములనియు నేబదియెదుపసంహారాయుధము లనియు, చతుర్థపాదమున సర్వశక్తిమంతములగు నారాయుధములు ప్రతిపాదింబడినవనియి ధనుర్వేదవిషయము చెప్పబడినది.

తృతీయధ్యాయమున ఖడ్గోత్పత్తి తద్వివరణము తెల్పబడినది.

చతుర్థ పంచమాధ్యాయములలో తొలుతటి రెండురకముల యాయుధముల వివరణమున్ను పంచమము చివర కలికాలోపయుక్తము లగు భయంకరాయుధముల విషయము వర్ణింపబడినది.

షష్ఠము సైన్యవిషయవివరణము, సప్తమము దండనీతిని గుఱించి, అష్టమమున రాజ్యపరిపాలనావిషయము సామాన్యధర్మములును ప్రతిపాదింపబడినవి.