పుట:Delhi-Darbaru.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఢిల్లీ దర్బారు

మొదటి ప్రకరణము

ఢిల్లీ పూర్వవృత్తాంతము.

ఆర్యావర్త చరిత్రమునఁ బ్రసిద్ధినొందినఁ బట్టణములలో నగ్రగణ్యము ఢిల్లీ. ఇది యనేకులచే ననేక యుగముల ననేక నామములచేఁ బిలువఁబడుచుండెడిది. దీనికి నాధునిక సుప్రసిద్ధ నామము ఢిల్లీయే యైనను, బ్రాచీన కాలమున సుప్రసిద్ధమయిన పేరు ఇంద్రప్రస్థపురము.

ఇంద్రప్రస్థము.

ఈనగరము పుట్టుటకుఁ బాండవులు కారణము. కురు సంతతి హస్తినాపురమున రాజ్య మేలుచుండిరి. పాండురాజు పరలోకమున కేగినపిదపఁ గొంత కాలమునకు ధృతరాష్ట్రుడు పాండుకుమారులకుఁ బాలు పంచియిచ్చెను. వారి భాగమునకు వచ్చినది. కురుక్షేత్రమునందలి ఖాండవప్రస్థము.

ఖాండవప్రస్థమనఁగా వ్యాప్తిగల యడవి. ఈయటవి ప్రదేశమున మూలనివాసు లుండెడివారు. వారనార్యులు.