పుట:Dashavathara-Charitramu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఓవిప్రులార వినుఁడీ, నావచనము నేఁటినుండి నన్నేలు హయ
గ్రీవునకు యాగభాగము, లీవలయు న్వహ్నిముఖుల కీవల దనినన్.

240


సీ.

ఏమేమి తాఁగాక యిఁక నెవ్వరున్నారు యాగభాగంబుల కనెడువారుఁ
దన కేల వచ్చె నింతమదాంధకారంబు తనువొల్లఁ డేమొకో యనెడివారు
సలుకక దుర్భాషలాడెడి దూతజిహ్వయె చీల్పవలయుఁబో యనెడివార
లెంతవింతలు పుట్టె నిది యేమి హేతువో యంచుఁ జిత్తమునఁ జింతించువారు


తే.

నొదిగి యేమనకూరక యుండువాఁర, లేమియుత్తర మంచు నూహించువారు
నగుసదస్యులలోఁ గొంద ఱార్యు లిట్టు, లనిరి సమయోచితంబుగా దనుజుఁ జూచి

241


తే.

నీవు సెప్పినబుద్ధి యెంతేని లెస్స, కాదనఁగ రాదు మాకు లోకముల కెల్ల
నేత గాఁడె హయగ్రీవనిశిచరేంద్రుఁ, డైన నొకమాట గల దెట్టు లనిన వినుము.

242


క.

వేదోక్తవిధిని మేమా, యాదివిజుల కొఱకె యిత్తు మధ్వరభాగం
బేదిక్కున స్వాతంత్రం, బేదీ మా కనిన దనుజుఁ డేగి రయమునన్.

243


శా.

ఆవార్త ల్వినిపింప దైత్యపతి రోషావేశ ముప్పొంగ నా
హా వేదంబుల యాగభాగము లమర్త్యశ్రేణికేగాని మా
కేవంకం బనిలేక యుండునటుగా నేర్పాటు గావించెఁ గా
నీ వేగంబ హరించి తచ్ఛ్రుతులు భగ్నీభూతము ల్సేసెదన్.

244


తే.

అరయఁగాఁ గశ్యపబ్రహ్మ కగ్రమహిషి, యైన దితిపుత్రులము గాన నాదిదేవ
తలము మే మట్టిమాకు నధ్వరములందు, భాగములు లేమిదేమి పాపంబుగాదె.

245


తే.

అహహ సత్రంపుఁగూటికి నమరవరులె, కాని మే మర్హులము గామెకాయటంచుఁ
[1]బరిహసించుచు నత్యంతపరుషరోష, రసకషాయితనేత్రుఁ డై యసురవిభుఁడు.

246


ఆ.

ఇంక నేఁడు మొదలు నెవ్వరు వేదముల్, [2]దలఁతు రట్టివారు దండ్యు లగుదు
రనుచుఁ జాటఁబంచె నఖిలలోకంబుల, దానవులకుఁ గలదె ధర్మచింత.

247


వ.

అంత.

248


క.

ఆవార్త లెల్ల నారదు, చే విని వీఁ డెంత దుడుకు చేసె నటంచున్
భావంబు గలఁగ శుక్రుఁడు, [3]వేవేగ న్వచ్చె దైత్యవిభుసభఁ జేరన్.

249


క.

వచ్చిన మునిపతితోఁ దన, ముచ్చట దనుజుండు దెల్ప మునిపతి దనలో
నచ్చెరువందుచు నిదియే, మిచ్చఁ దలంచితివి దానవేశ్వర చెపుమా.

250


తే.

అక్కటా స్వయంవ్యక్తము లైనశ్రుతుల, నౌనుగాదనఁ దగునె యయ్యజునకైన
సురలయందును ధర్మ మసురులయందుఁ, గలుషమును గల్గ మీకు భాగములు గలవె.

251
  1. నపహసించుచు నత్యంత హర్ష రోష
  2. దగఁ బఠించువారు
  3. వేవేగమ కదలి దైత్యవిభుసభఁ జేరెన్