పుట:Dashavathara-Charitramu.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

వ్రాలునింద్రాదిదిక్పాలవల్లభుల పట్టణములు నేలమట్టములు గాఁగఁ
బఱచు హేమనగాదిపర్వతరాజశృంగంబులు ఛిన్నభిన్నంబులుగను
నెగయు భానుశశాంకనిఖిలగ్రహము లూడిపడఁగ బ్రహ్మాండకర్పరము దాఁకఁ
దూఱువారాసులు దుర్వారతరసప్తపాతాళవాసులు పగిలిపాఱఁ


తే.

దిరుగు బహుచిత్రగతుల నంబరమునందు, నిజగతాగత మెఱుఁగక నిబ్బరముగ
నొరసి దేవవిమానము లుర్విఁ గూలఁ, బ్రశమితజగత్త్రయంబు పురత్రయంబు.

8


సీ.

అని చేసి పొడిసేతు మని యెందు వెదకుచు పురములు గానక తిరుగుటకును
బరికించి చొరలేక పై వైచి వజ్రాదిబహుశస్త్రములు మొక్కపఱుచుటకును
బాలెంబుడిగి యున్నపట్ల నెందేనొక్కపురి గుప్పుమని కూలఁ బొలియుటకును
గైలాసమందరకనకాద్రిముఖ్యభూధరకందరములందు దాఁగుటకును


తే.

నెందు బెడబెడమనిన మహీధరంబు, విఱిగి పైఁబడునంచును వెఱచుటకును
గానిదైత్యాధిపతులతోఁ గలసి మెలసి, యాహవము సేయఁజాల రింద్రాదిసురులు.

9


క.

పురదైత్యపరాజితులై, హరిహయముఖదివిజు లజునిఁ బ్రార్థింప వచో
వరుఁ డాయమరులతోఁ జని, హరు వేఁడిన నతఁడు శౌరి నడుగుదమనుచున్.

10


మ.

నెలపూఁదాలుపు గిబ్బ నెక్కి వెడలన్ వెన్వంట నచ్చంపుఱె
క్కలతేజీ నడిపించెఁ బద్మజుండు మున్గాకుండ దట్టించుచున్
వలచే వాగెబిగించి హస్తిడిగి యశ్వం బెక్కి కూడెన్ విశృం
ఖలుఁడై వాసవుఁ డన్యనిర్జరులు వెన్కంబోయి రంతంతటన్.

11


క.

అప్పుడు గలశాంభోనిధి, చప్పుడు పెదవిన్నపములు సాగింపంగా
నప్పలుకుచెలువచెలువుఁడు, విప్పుం గనుదొరలతోడ వేడుక ననియెన్.

12


మ.

చెలువారంగఁ దరంగహస్తముల రాజీవాయతాభీలచం
చలవాతాహతధూతశీతలవృషత్సంఘాతముక్తాళిచేఁ
గలశాంభోనిధిసార్వభౌముఁడు వియద్గంగాలతాతన్విపైఁ
దలఁబ్రా ల్వోయుతెఱంగు గంటిరె శుభోదర్కంబుగా నీయెడన్.

13


క.

కలశాంభోధి మథింపఁగఁ, గలిగినయమృతంబు మీరు గైకొని వెన్నన్
నలినాక్షునిపా లిడినటు, వలెనున్నది తెల్లదీవి వైఖరి నిచటన్.

14


క.

సమ్మద మెసఁగం గంటిరె, తుమ్మెదగల మావిపంటితులదూఁగుచు నీ
క్రొమ్మొగులుడాలువేలుపు, కమ్మనికుందనపుమేడఁ గడుచోద్యంబై.

15


వ.

అని యకుంఠితమహిమాకరంబగు వైకుంఠపురంబు వాణీకలకంఠకంఠికామనో
హరుండు వర్ణింప సముత్కంఠ వినుచు నీలకంఠాది విబుధకంఠీరవు లుపకంఠ
నిరవకుంఠనముక్తాతోరణఘృణిశుంఠితశతసహస్రగురువరారోహాజారం బగు
హరిహజారంబుఁ బ్రవేశించి ధగద్ధగితమణిమయచతురకక్ష్యాంతరంబులు గడచి