పుట:Dashavathara-Charitramu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అని యత్యుగ్రత భార్గవుం డవనిలో నాబాలవృద్ధంబుగాఁ
దునిమెన్ రాజుల నేమి చెప్పుదును దద్రోషంబు రాజాంగనా
జనగర్భంబుల నూడ్చె హుంకృతి ధనుజ్యాటంకృతిన్ ఘోరగ
ర్జనలన్ రూక్షనిరీక్షణచ్ఛటల దుర్దాంతాట్టహాసంబులన్.

146


తే.

ఇవ్విధంబున రాజుల నెల్లఁ ద్రుంచి, యరిగి మఱికొన్నినాళ్ళకుఁ దిరిగివచ్చి
ఆదిఁ దనదృష్టిపథమున కందనట్టి, గర్భములఁ బుట్టుశిశువులఁ గని వధించు.

147


శా.

ఈలా గిర్వదియొక్కమాఱు నృపులన్ హేలాగతిన్ రాముఁ డా
బాలప్రౌఢజనంబు గాఁగ వధియింపన్ రాజకాంతావిలా
పాలాపంబులు భూమినెల్లెడల మెండై నిండెఁ దద్దైన్యము
న్మూలించె న్మది నెంచి కశ్యపుఁడు రాముం జేరి దీవించుచున్.

148


మ.

ఇల నిక్షత్ర మొనర్చి చేసితి మఖం బీవిశ్వవిశ్వంభరన్
బళిరే దక్షిణ గాఁగ నిచ్చితివి దానక్షాత్రధర్మంబులం
గలరే నీసరి యీక్షితిస్థితిని సాక్షాత్పంకజాక్షుండ వీ
వలఘుస్తోమయశోభిరామ భృగురామా సార్వభౌమాంతకా.

149


క.

మాకొసఁగిన వసుమతిలో, నీ కేటికి సంచరింప నిఁక దక్షిణర
త్నాకరతీరముఁ జేరు ప్ర, భాకరశశికులవిరామ భార్గవరామా.

150


క.

అన మంచిది యని రాముఁడు, చని చాపం బెక్కుపెట్టి శరము [1]దొడిగి వా
ర్ధినిఁ గొట్టఁబోయి నంతనె, తనరంగా కొంతచోటు తత్క్షణ మొసఁగెన్.

151


తే.

అందు విహరించె రాముఁ డనంత నంత, బ్రాహ్మణుల కిచ్చి యంతఁ దపంబు సేయఁ
జనియెఁ గశ్యపుఁ డవని కాస్యపి యనంగ, నమరె నది యాది మఱి యుర్వి యౌట వినుము.

152


చ.

క్షితిసురు లిట్లు కశ్యపునిచే మహి గాంచి ప్రభుత్వ మొప్ప సం
తతమును రాజభోగపరతంత్రత భార్గవుచే ననాథ లై
గతి మఱి యొండులేమి నృపకాంతల సమ్మతి బల్మినైన సం
గతి యొనరించుచుం గ్రతుమఖక్రియ లన్నియు నీఁగి రయ్యెడన్.

153


తే.

తగిన దండంబులేమి నుద్దండవృత్తి, వైశ్యులును శూద్రులును విప్రవరు లుదార
గోధనాదుల బలిమిఁ గైకొనఁగఁ దొడఁగి, రి ట్లరాజకమై ధర్మ మెల్లఁ జెడిన.

154


క.

కుతలం బతలం బంటిన, వెతలం బడుచున్న జనుల విని కశ్యపుఁ డూ
రుతలంబున నెత్తఁగ క్షో, ణితలం బుర్వియనఁ బరఁగు నృపకులతిలకా.

155
  1. దొడి పయో, ధిని జోటు వేఁడఁ జుట్టుం, దనలోఁ జేటంతచోటుఁ దటమున నొసఁగెన్.