పుట:Dashavathara-Charitramu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

సాటి యనవచ్చు మగదలశాసనాంక, వేంకటామాత్య మకరాంకపంకరహిత
పంకజగృహాజనకనిష్కలంకపూర్ణ, చంద్రునకుఁ బద్మనాభసుధీంద్రునకును.

40


సీ.

ప్రతిఘటించిన నెంతబలవంతులను బటాపంచగాఁ దఱిమించుప్రౌఢిమంబు
నమ్మితి మన్న నెంతటిదరిద్రుల నైన శ్రీలచేఁ జెల్వొందఁజేయుకరుణ
మతభేద మన్నచో మతిమంతు లౌనన నైకమత్యము సేయునలఘుబుద్ధి
వలయునటన్న భూవరుల చెంగటఁ గార్య మెంతయైనను నిర్వహించునేర్పు


తే.

విద్య వినయంబు తాదృశవిభవమునను, శాంతి యేపట్ల ధైర్యంబు సరసమృదుల
భాషణంబులు గల్గి వైభవము మీఱఁ, బ్రబలు మగదల పద్మనాభప్రభుండు.

41


సీ.

మంత్రీశ్వరుఁడు గాన మౌళిపై వలగొన్న భాగీరథి యనంగఁ బాగ దనర
రామకథాసుధారసము బుగ్గలఁ బోలి కట్టాణిగొప్పచౌకట్లు మెఱయఁ
గనకంబుఁ గెలుచునంగంబు తేజములీల నేకరంగికబాయి యింపు గులుకఁ
బైకొన్న యాదిమప్రభులకీర్తులరీతి వలిపెపైఠాణిదువ్వలువ వెలయ


ఆ.

గుణములను బోలి వృత్తానుగుణము లయిన, కంఠమాలిక ముత్యాలకడియములును
మొదలుగాఁ గల భూషణంబులు వెలుంగఁ, బ్రబలు మగదల పద్మనాభప్రభుండు.

42


సీ.

అపరిహాస్యంబుగా నన్యమతంబులయందు శంకఘటించునౌఘళంబు
నలరామకథల పాయసనిభాగంబుల నేకరీతిగ నిర్వహించుపటిమ
జీవకర్మానాదిభావ మీశ్వరసమత్వము గ్రమంబునఁ దెల్పు తత్త్వసరణి
ఘనభర్తృహరిశతకత్రయంబునఁ బ్రతిశ్లోకంబునను వింతఁజూపు సొబగు


తే.

మఱియుఁ జాటువులందు రామాయణాది, బహువిధగ్రంథములయందుఁ బ్రాజ్జు లెన్నఁ
బూర్వసిద్ధాంతపక్షము లొసఁగఁజేయు, భళిర మగదల పద్మనాభప్రభుండు.

43


సీ.

దరముతోఁ దుహినకందరముతో గిరిశనూపురముతోఁ బచ్చకప్పురముతోడ
రసముతో ధవళసారసముతో శివమహాననముతో నుషితమానసముతోడ
శరముతో మరుజాజిశరముతో ముత్తేలసరముతో దేవతాసరముతోడ
భవునితో నజతనూభవునితో రేవతీధవునితోఁ గుముదబాంధవునితోడ


తే.

దోడునీడయి క్రీడించు వేడు కలరఁ, బ్రౌఢ గావున మగదల పద్మనాభ
సచివమూర్ధన్యబహుదానజాయమాన, కీర్తికాంతాలలామ దిగ్విజయధామ.

44


చ.

మగదల పద్మనాభునిసమస్తగుణవ్రజముం గణింపఁ గా
నగణిత మౌట నూరక గుణాకరుఁ డంటిని దొంటివారలున్
నగుణుఁడు పద్మనాభుఁ డని సన్నుతి సేయుటె కాని తద్బహు
ప్రగుణగుణంబులు న్వరుసఁ బాయక యన్నియు నెన్న నేర్చిరే.

45