పుట:Dashavathara-Charitramu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ముఖ్యనానాదానముదిత భూసురచంద్ర నాగప్రధానేంద్రనందనుఁడవు
పణియమాంబాగర్భపాథోధిచంద్రుఁడ వాత్మవిద్రఘునాయకాద్యనుజుఁడ


తే.

వాప్తుఁడవు గాన వేఁడెద నందముగను, గృష్ణునిదశావతారము ల్గృతి యొనర్చి
యంకితము సేయు మాకుఁ బ్రఖ్యాతి నీకు, మహితగుణసాంద్ర రామయామాత్యచంద్ర.

16


వ.

అని కనకాంబరాభరణగ్రామబహుగ్రామసమేతంబుగాఁ గర్పూరతాంబూలంబు
సమర్పించినం గైకొని కౌతుకతరంగితాంతరంగంబుతోఁ గృతినాయకుని వంశా
వతారం బభివర్ణించెద.

17


సీ.

శ్రీకరవేదాంతసిద్ధాంతవైఖరీపారదృశ్వలు పరబ్రహ్మ మనియు
సృష్టిప్రధానప్రకృతితత్త్వవిజ్ఞానపరు లైనసాంఖ్యులు పురుషుఁ డనియుఁ
గ్రతుముఖ్యనిర్మలకర్మప్రవర్తనహితులు మీమాంసకులీశుఁ డనియుఁ
పంచనంస్కారవద్భక్తిప్రపత్త్యుదంచితపాంచరాత్రులు శేషి యనియు


ఆ.

మఱియు ధన్యులయిన మాధ్వు లంతర్యామి, యనియు నెట్టిదేవు నాశ్రయింతు
రట్టిదేవదేవుఁ డాదినారాయణుఁ, డఖిలజనముఁ బ్రోచు నాదరమున.

18


తే.

[1]భువనజాతాశ్రయం బౌట భోగిశయను, నుదరతలమున నీరజ మొదవె దానఁ
గలిగె బ్రహ్మరజోయుక్తిఁగారణాను, గుణము కార్యం బగుట యెట్లొకో గణింప.

19


తే.

బ్రహ్మకు జనించెను మరీచి బ్రహ్మవర్చ, నకృతఘర్మమరీచిలోచనమరీచి
యతని కుదయించెఁ గశ్యపుఁ డనభివిదిత, గోత్రదాయకుఁ డయికులగోత్రధృతిని.

20


శా.

శ్రీమత్కాశ్యపగోత్రవారిధి జనించెం బూర్ణసోమాకృతిన్
సోమామాత్యుఁడు సత్కళావిలసనాస్తోకావలోకంబు శ్యా
మామోదంబుఁ గలప్రసక్తకమలోదారప్రచారంబు ని
త్యామందప్రమదాశ్రయద్బుధకుమారాసక్తియు న్మీఱఁగన్.

21


సీ.

రసమంటె ననుచు నీరసముతోడఁ బుటంబు వేయ మేరువుఁ జేరె విశ్వకర్మ
రాయంచఁ దేనేమిరా యం చమర్షియై సాదితో వాదించె షణ్ముఖుండు
నారదకలను గన్నార దర్శింతురే యని తుంబురుని వేఁడె నమరవిభుఁడు
నలువదనంబుల నలువొందుశివుఁ డెందుఁ గలిగె నంచు విరించిఁ గనిరి మునులు


తే.

మహితమగదలసోమనామాత్యసోమ, రామణీయకయుతకీర్తిరామరుచిర
రుచినిచయ మెల్లదిక్కులఁ బ్రచుర మయిన, బ్రమసి తెలియంగఁజాలక ప్రౌఢు లయ్యు.

22
  1. భువనజాతాస్పదం