84 చిన్ననాటి ముచ్చట్లు
వాయించు వానివద్దకు (లేక కనకతప్పెట వానివద్దకు) ఉరికి - ఆ వాద్య విశేషమును అంటునట్లుగా తన తలను చెవి యోరన ఆనించి, చెవిగట్టిగా మూసుకొని - 'అద్దద్దద్దద్ద శరభ - శరభ' అని ఉచ్ఛ స్వరమున పల్కును. ఆ పలుకునకు అనుగుణ్యముగా అతడా వాయిద్యమును గట్టిగా వాయించును. అసలా 'శరభ' శబ్దము వాని నాభికమలము నుండి భేదించు కొని మారు మ్రోగుచు వెలికివచ్చును. అది వినుటకు మహాభయంకరముగను, రౌద్రముగను, భక్తులకు భద్రమొసగునట్టిదిగను యుండును. కొందరు వీరశైవులీ ప్రభలకెదుట నారసములు గ్రుచ్చుకొనుట, గండకత్తెరలు వేసుకొనుట అను అఘాయిత్యములను కూడా చేయుదురట.
ఈ కోటప్పకొండ తిరునాళ్ల ఏటేటా జరుగు జాతీయ మహోత్సవము. ఈ తిరునాళ్లలో రైతులకు కావలసిన పనిముట్లను ప్రదర్శించి విక్రయించెదరు. రెండు మూడు దినములు ఈ కొండచుట్టూ జనము, పశువులు, అంగళ్లు కిటకిటలాడుచుండును. బిచ్చగాండ్రును విచ్చలవిడిగా వత్తురు. ఈ మహోత్సవము చూచుటకై అధికారులును క్యాంపులు వేసుకొందురు. అక్కడికి వచ్చిన జనులు పాకలలోను, చెట్ల క్రిందను దిగి వంటలు చేసుకొనెదరు. సర్కారువారున్ను వచ్చినవారికి సౌకర్యము లొనర్చి, పోలీసు బందోబస్తు గావింతురు.
ఈ ఉత్సవములకు ప్రభల వెంటను, విడిగాను ఆ చుట్టుప్రక్కల గల స్త్రీలును విస్తారముగ వత్తురు. ఆ ప్రాంతమున విస్తారముగ మెట్ట వ్యవసాయము. పురుషులతోపాటు అచ్చట స్త్రీలును పొలములలో పాటపడనేర్చినవారు. పల్నాడు ఇచ్చటకి సమీప ప్రదేశము. పల్నాటి సీమను గూర్చి శ్రీనాథుడు చెప్పిన చాటు పద్యములు కనుడ :