22 చిన్ననాటి ముచ్చట్లు
విజయదశమినాడు అమ్మవారికి గొప్ప పార్వేట ఉత్సవము జరుగును. ఆనాడు అమ్మవారికి వజ్రములతో చెక్కబడిన అనేక ఆభరణముల నలంకరించి వూరేగించెదరు. మామూలుగా అమ్మవారు గిడ్డంగివీధి అనే వరదాముత్తియప్పన్ వీధిగుండ పోవుట ఆచారము. దుండగులు దుర్మార్గము చేయుదురనే, విషయం దేవస్థానం ధర్మకర్తలకు కొద్దిగ తెలిసి పోలీసు సిబ్బందితో అమ్మవారి ఉత్సవమును సాగించిరి. అమ్మవారి వెంట వచ్చు పోలీసు సిబ్బందిలో ముఖ్యలు వెల్డన్ యను దొరగారు. ఆయన ఆకాలమున పోలీసు శాఖలో పేరుపొందిన వారిలో నొకరు. వీరితో కూడ మరి ముగ్గురు సార్జంటులు గుర్రములనెక్కి ముందు నడచుచుండిరి. అమ్మవారికి ముందుగా ముఖ్య ధర్మకర్తలగు శ్రీ కొల్లా కన్నయ్యశెట్టిగారు. వారి చుట్టును ఇతర ట్రస్టీలగు వైశ్యులును నడుచుచుండిరి. వారి వెనుక దేవస్థానపు నౌకర్లు. వారిలో నేనును, పండిత గోపాలాచార్యులు మున్నగువారు నుంటిమి. ఆ కాలమున అమ్మవారితో కూడ దివిటీలను పట్టుటకు 'సోమరివాండ్లు' అని యొక వర్గముండే వారు. వారు ఇనుప త్రిశూలములకు బిగించిన కర్రలను తీసికొని ఆ త్రిశూలములకు పాతగుడ్డలను గుండ్రముగాచుట్టి, నూనెతో తడిపి దివిటీలను వెలిగించి వెలుతురు చూపుచు వెంట నడిచేవారు.
ఆనాడు రాత్రి 10 గం|| లైనది. ఉత్సవము గిడ్డంగివీధిలో సాగినడచుచున్నది. ముందు నడచుచున్న పోలీసు సార్జంట్లు నలుగురు దుండగుల మీదికి గుర్రాలను దుమికించిరి. వారప్పడు చెదరిపోయిరి.
అమ్మవారిని క్రింద పడవేసి నగ లపహరింతమని యుద్దేశించిన దుండగుల అభిలాష విఫలమైనది.
వైద్యశాలలో నేను చేయుచున్న నౌకరివల్ల నా వైద్యవృత్తికి కూడ మెరుగువచ్చినది. అప్పుడు నా జీవితములోని కష్టములు చాలా భాగము మరుగైనవి. గోపాలాచార్యులవారికిని, నాకును మంచిస్నేహము కుదిరినది.