Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 21

జాలయ్య, అప్పయ్య, వీరు యెన్నదగినవారు. ఇందులో జాలయ్య మంచి కసరత్తు చేసిన వస్తాదు. కొల్లా కన్నయ్య శెట్టిగారితో కూడ గరిడీని నేర్చుకున్నవారు. వారారోజులలో ఆ తొమ్మిది రోజులకు 1116 ర్లు తీసుకొనేవారు. జిహ్వాచాపల్యము తీర్చుకొనుటకై అమ్మవారి ప్రసాదమని అభ్యంతరములేకుండా ఆనాటి గొప్ప యిండ్లవారుకూడా ఏదో యొక రోజున పంక్తి భోజనమునకు వచ్చేవారు. ఏ కారణముచేనైన రాజాలని పెద్దలు ఆ ప్రసాదమందలి తీపిచే ఇండ్లకైన తెప్పించుకొని భుజించేవారు.

నేను దేవాలయమునకు సంబంధించిన నౌకరినగుటచే ఆ తొమ్మిదిరోజులు వంటశాల భోజనశాలలకు, నన్ను సూపరింటెండెంటుగా నియమించేవారు. ఈ వంటశాలలోని నెయ్యి, బియ్యము, చక్కెర, కుంకుమపువ్వు, పచ్చకర్పూరము, ద్రాక్ష వగైరా వెలగల సామానులు సామాన్యముగా చోరీ అగుచుండేవి. ఆ చోరీలు జరుగకుండా జాగ్రత్తగా చూచుట, వంట చక్కగచేసి, వడ్డన శ్రద్ధగా జరుపుట మున్నగు కార్యములను గమనించుట నా పనులుగా నుండెడివి. ఎంత జాగ్రత్తగ నుండినను చోరీలు జరుగుచునే యుండెడివి. బియ్యమును దొంగలించు విధము : ఒక పెద్దగంపకు సగము వరకు బియ్యమును పోసి దానిపైన భుజించిన ఎంగిలి ఆకులను నిండుగ కప్పినింపి, ఆ గంపను బయటికి పంపుట; నేయి దొంగలించు విధము : పేరిన నేయిని తప్పెలలోపోసి దానిపైన బియ్యపు కడును పోసి, పశువుల కుడితి యని బయటికి సాగనంపుట; కుంకుమపువ్వు వగైరా చిన్నవస్తువుల దొంగతనము : పొట్లాలుగట్టి భోజనమునకు వచ్చిన ఇతరులచేతికి రహస్యముగా నిచ్చి బయటకి దాటించుట. ఇట్లే అనేకమగు ఉపాయములు. ఈ వుద్యోగము వలన నాకు పాకకళ చక్కగ అబ్బినది.