పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23

నెల్లూరి నాటక సమాజములు

నెల్లూరి వర్ధమాన సమాజమునకు ముఖ్య పురుషులు శ్రీమాన్ కే.ఏ. వీరరాఘవాచార్యులుగారు. ఈ సమాజమునకు వీరు తండ్రి. నాటకముల శాఖ నలంకరించుచుండినవారిలో శ్రీకాసుఖేల కపాలి రామచంద్రరావుగారు, వరదాచారిగారు, ముంగమూరి వెంకటసుబ్బారావుగారు, నందగిరి హనుమంతరావుగారు, రామానుజాచారిగారు, వవ్వేటి విశ్వనాథరావుగారు, సింగరాచార్యులుగారు, ముత్తరాజు శివకామయ్యగారు మున్నగువారు నాకు బాగుగ జ్ఞాపకమున్నవారు.

వీరందరు ఉద్యోగస్తులు; పెద్ద మనుష్యులు, చక్కని నటులు. అయితే నాటకములు వేయవలెననే కుతూహలమున్నంతగా అందుకు తయారుకావలయుననే శ్రద్దయుండెదికాదు. వీరికి ఆంధ్రభాషాభిమానిసమాజమునకువలె గురుత్వముతో శిక్షించి ఒద్దికల దిద్దగల వెంకటరాయశాస్త్రిగారివంటి ప్రతిభాశాలురు లేరు.

శ్రీ నందగిరి హనుమంతరావుగారు స్త్రీవేషమున 'స్త్రీయేనా' అని భ్రమింపజేసేవారు. దసరా ఉత్సవములలో - లఘు ప్రదర్శనములు, ప్రహసనములు వేయుచుండిరి. అందు ముఖ్యముగా నాటకములకు సంబంధించినంతవరకు 'టాబ్లో' (Tableau) అనే పాశ్చాత్యపద్దతి ననుసరించి ఒక్కొక్క ఘట్టమును ప్రదర్శించేవారు. అనగా ఆ ఘట్టమున కవసరమైన - (విశ్వామిత్రునకు హరిశ్చంద్రుడు రాజ్యమునొసంగుట, దమయంతిని నలుడు విడిచి చనుట, ఇత్యాదులు) వేషముల ధరించుకొని ఆయా అభినయమున కదలక మెదలక రంగమున నిల్చియుండేవారు.