172 చిన్ననాటి ముచ్చట్లు
వర్ధమాన సమాజమువారు నాటకములు వేయురాత్రి నేను మద్రాసునుండి వారికి కావలసిన వస్తువులను తీసుకొనిపోవుచుండేవాడను.
ఈ సమాజమువారు తిక్కన పఠనమందిరము నొకటిని, పుస్తకభాండారము నొకటిని నడుపుచున్నారు. దానిలోనే యొకశాఖను వేదము వేంకట్రాయశాస్త్రిగారి పేర నొక గ్రంథాలయముగ నేర్పరచి యున్నారు. ఈ సమాజము తరపున చిరకాలమునుండి ఏటేటా తిక్కన జయంత్యుత్సవమును చాల వైభవముగ జరుపుచున్నారు. శ్రీ వేదము వేంకట్రాయశాస్త్రిగారి వర్ధంతియు ఏటేటా జరుపుచున్నారు.
శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రిగారి శిష్యత్వముకోరినవారు వేరై - 'ఆంధ్ర భాషాభిమాని సమాజము'గా నేర్పడిరి.
శ్రీ శాస్త్రిగారు గొప్ప పండితులు, కవులునేగాక గొప్ప ఉపాధ్యాయులు. ఆంగ్ల నాటకముల సాంప్రదాయముల నెరింగినవారు. కావున రంగస్థల, నిర్వహణ మర్మములన్నియు తెలిసినవారు. క్రిస్టియన్ కాలేజీలో సంస్కృతాధ్యాపకులుగా చేరినపిదప ప్రతి సంవత్సరమును ఏదోనొక సంస్కృతనాటకమును వారికి బోధింపవలసియుండెను. ఆ బోధించుటతో తృప్తిపడక, తమ శిష్యులలో చురుకైనవారి నేరి వారివారికి తగిన పాత్రలనొసంగి నాటకమును నేర్చేవారు. భవభూతికృత 'ఉత్తర రామచరితము' అను నాటకము, కేవలము చదివి ఆనందించవలసినదేగాని ఆడి, చూడదగినదికాదని పలువురి అభిప్రాయము. అందుచే ఎల్లరు దానివంకచూడక వదలివేసిరి. అట్టిదాని నొకసారి శ్రీశాస్తులవారు తమ శిష్యులకు నేర్చి ప్రదర్శింపించి అందరిచే మెప్పుబడసిరి. "ఆంధ్రభాషాభిమాని సమాజము" 13 గురితో నేర్పాటైనది.