పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/852

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

956

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

శిష్యు : ప్రకటించకండని మనవి చేసుకున్నాను. అందులో నామాటల్లా వుండఁగా మీకంటె విద్యావయోవృద్దులైన చాలామంది పెద్దల్ని చాలా నీచంగా "తద్దినం బెట్టే వాఁడితమ్ముఁడు” వగయిరా పరిహాసోక్తులతో తిరస్కరించి వున్నారు, వారందఱికంటే కూడా మీరు గొప్పవారయితేకండి గాని యెంత గొప్పవారైనా వ్రాఁత అలా వుండకూడదు. వారు మీవ్రాఁతను లక్షించరే అనుకోండి, చదువరులు హేయంగా భావిస్తారు గదా! ధాష్టీకపంతులు, లొడారి బుచ్చిగాఁడు, వగయిరాలతో పాటిదే అనుకోండి శృంఖలాన్ని, పయిఁగా పద్యాలు తగలఁబెట్టుకోమనడం వకటాయె, దాన్నే పండితుఁడు సమర్ధిస్తాఁడు. మీరేదో కార్యం కోసం యేరాజునో దర్శించడానికెడితే ఆయన యేమని యెత్తిపొడిచారో? జ్ఞాపకం తెచ్చుకోండి (లొడారి బుచ్చిగాఁడు)

గురు : (తమలో) వీఁడు తన శనిగ్రహము, కామేశ్వరి, గీరతము, లోనైనవానిని మఱచినట్లున్నాఁడు (ప్రకా) దానిలో "కాలీన" లోనైన శబ్దముల విషయమున్నది గదా? దానిలోనేనా జయము వచ్చితీరును.

శిష్యు : దానిలోనూ జయం రాదు, విద్యారణ్యులు, శంకరులు, వీరుకాక యావత్తర్కశాస్త్ర గ్రంథనిర్మాతలు, మహాకవిదండి, యిందఱు ప్రయోగించారని నాకు తెలుసును. తక్కిన రామానుజ మాధ్వభాష్యకర్తలు కూడా వాడే వుంటారు. యిందులో విద్యారణ్యులు వ్యాకరణంలో కూడా గ్రంథకర్త. తరువాత తమచిత్తం.

గురు : ఏమైనను కౌముదిలో భట్టోజీదీక్షితులు త్రోసివేసినది బ్రదుకదు. ఇది నిశ్చయము.

శిష్యు : దీక్షితులు తోసివేసినా బతికేవిన్నీ క్వాచిత్కంగా వున్నాయి. పని పడ్డప్పుడు మనవి చేసుకుంటాను. యిప్పుడు గ్రంథవిస్తర మెందుకు? -

గురు : నీవాదమంతయు ప్రతివిషయమునందును నిట్లేయుండెడిని. వెనుక వైకర్తన వాదములో నాకనుభూతమైనది. పైఁగా నాభారతమును కూడ "చింత్య" మన్న ప్రబుద్దుడవు.

శిష్యు : అదుగో! మళ్లాదీన్ని జ్ఞాపకం చేస్తూన్నారూ గురువుగారు. వైకర్తన శబ్దానికి వకచోట మీరు సూర్యపుత్రుఁడని ఫుటునోటు వ్రాస్తిరి. గ్రంథభాగంలో "సహజ కవచకుండల కర్తనాత్కర్ణః" అనే అర్ధాన్ని అవలంబిస్తిరి. చింత్యమనక యేమనేది? సెలవియ్యండి.