పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/847

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురు శిష్య ప్రశ్నోత్తరములు

951


పదియేళ్లతిక్రమించినా యిప్పటికిన్నీ సవరణ కానేలేదు. ఆ మదరాసుదరిమిలానే మీరు నన్ను ముక్త్యాలకు రమ్మని నిర్బంధించింది జ్ఞాపకం తెచ్చుకోండి.

గురు : నీవలె నాకీ స్వల్ప జ్ఞాపకాలన్నియు జ్ఞప్తియందుండవు. నాధారణ గుఱికి బారెఁ డెచ్చుతగ్గుగా నడిచెడిది.

శిష్యు : ఆలాటిధారణ కావడంచేతనే వట్టి అపోహలు కలుగుతూ వుంటాయి. ఆ అపోహలేకదా? యీ వ్రాఁతల క్కారణ మయ్యాయి.

గురు : తిరుపతిశాస్త్రి కొడుకుచేత కొల్లాపురం పండితునికి అభిప్రాయ మిప్పించినది నీవేనా?

శిష్యు : నేను కాదు. జయంతి రామనాథశాస్త్రి. అతఁడే అందఱిదగ్గఱకీ తీసుకు వెళ్లినవాఁడు. అసలు దానిలో సారంలేకపోతే యెవ్వరూ యివ్వకపోదురు. మీదానిలోని అసారత్వమూ దానిలోని ససారత్వమూ స్పష్టంగా కనపడడంచేత అందఱు పండితులూ సదభిప్రాయాన్ని యిచ్చారు. యిచ్చినవారిలో చాలా విద్యావృద్దులూ వయోవృద్దులూ వున్నారు. నే నివ్వకూడదన్నందుకు నాకూ సమ్మతమే కాని “అపంధానం తు గచ్ఛంతం సోదరో౽పి విముంచతి"

గురు : ఆలాగా? పోనీ నీకు బ్రహ్మయ్యశాస్త్రులవారియం దున్నంతగురు భక్తి యితరగురువులయందున్నదా?

శిష్యు : లేదని మీరుతప్ప యేయితరగురువులున్నూ అనలేదు. యెవరివల్ల యెంతవుపకృతి పొందేనో వారియందంత గౌరవమున్నూ నాకు వుంది. విరక్తిమాత్రం యేగురువులయందున్నూ లేదు.

గురు : నీకు లోకములో పేరేయున్నచో నయ్యది శాస్త్రమువల్లనా? కవిత్వమువల్లనా?

శిష్యు : శాస్త్ర కవిత్వోభయసమ్మేళనంవల్ల నని అనేకుల అభిప్రాయం. యింకా అడిగితే కవిత్వంలో అంతోయింతో రసం వుండడంవల్ల, మొదటిదానికన్న యిదే నిక్కమేమో.

గురు : నీకు జగదతీతమైనకవి ననెడిగర్వమున్నదా? లేదా? చెప్పు.

శిష్యు : వుంది. లేదు. నాకంటె యీ విషయం మీయందు సమర్ధించడం మిక్కిలీ సుళువు. వుందే అనుకోండి, దానివల్ల వచ్చేయశస్సు మాత్రం యెవరిది? గురువులదే కదా? ఆ పరంపరలో అంతో యింతో తమకున్నూ వాటా వుండి