పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/766

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

870

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

పైని చూపిన శాంతి వ్యాసపు వాక్యముల వలన గురువుగారి "శృంఖలము" నేను చూచి చాలారోజులైనను వారేమో ఆయీ విషయములు ప్రమాదముగా నట్లు వ్రాసిరేకాని వేఱొకటికాదని సరిపెట్టుకొను చుండేవాణ్ణి అని తేలుచున్నదిగదా. ముక్త్యాల విషయమైన అపోహకూడా ఈ ప్రసక్తిలోనిదే. దానికి వారు నన్ను ముక్త్యాలరమ్మన్నప్పుడు అనారోగ్యంచేత నేను వెళ్లలేక పోవడమే కారణంగా అనుకొనేవాణ్ణి. యేమైనా వారి అపోహలని గుఱించి వ్రాస్తే వారి మనస్సుకు కష్టంగా వుంటుందని యెంచి యేమిన్నీ వ్రాయడానికి దిగలేదు. శాంతివ్యాసంలో కొంచెంగా స్పృశించి మాత్రం వదలిపెట్టేను.

ఇంతలో కొన్నాళ్లకు గండపెండేరపు సభ తారస మయింది. నా కప్పటికే “దినదినగండం వేయేండ్లాయుష్యం" మోస్తరులో ఆరోగ్యం వుండడం మొదలెట్టింది. కాని లోకులకు మాత్రం అంతబాగా తెలియదు. అట్టిస్థితిలో ఆ వుత్సవానికి నలుగురుతోపాటు నాకు ఆహ్వానం వస్తుందికదా! అనారోగ్యంచేత దూరస్థంలో వున్న బెజవాడకు వెళ్లలేకపోతానేమో! అని అనుకుంటూవుండేవాణ్ణి. బెజవాడల్లా రాజమండ్రిగా మాఱింది. కాని వేసవిలో అవుతుందని కూడా తెలుస్తూ వచ్చింది. అప్పుడే అయితే రాజమండ్రికి కూడా వెళ్లలేనేమో అనుకొనేవాణ్ణి. నా పాలిటిదైవం దాన్ని ఆశ్వీజందాకా నిల్పుచేయడమే కాకుండా, గురువుగారి కిష్టంలేకపోయినా దాని అధ్యక్షత తనంతట తానై నా మీఁద విఱుచుకుపడేటట్టు కూడా చేశాడు. ఆ సభలో వర్తించిన నా వర్తన సభ్యులకేకాక గురువుగారి క్కూడా తృప్తికరమయింది. దానితో గురువుగారి మనోమలిక మటుమాయమైపోయింది. అంతతో యే గొడవా లేకుండా పోవలసిందే. కాని హైదరాబాదు వారికి యెవరో యేకలవ్యశిష్యుని సంరక్షణార్ధం గురువుగారు వ్రాసిన వుత్తరాన్ని వుదాహరించి విమర్శించి అచ్చొత్తించి ప్రకటించిన కాగితాలు నిన్నమొన్న నావద్దకు వచ్చాయి. అవిచూస్తే వారిదగ్గిఱ నే చదివిన చదువును గూర్చి నేను అబద్ధమాడినట్లొకటిన్నీ ముక్త్యాలలో ద్రోహం చేసినట్లొకటిన్నీ పాలకొల్లులో మోసం చేసినట్లొకటిన్నీ వెరశి మూఁడు దోషాలు మనోవాక్కాయములచే సుతరామున్నూ నే యెఱుఁగనివి నా మీఁద వున్నట్లు తేలింది. యీ మూఁడింటిలోనూ వకటి వుత్తరం వల్ల స్థిరపడుతూ వుంది. తక్కిన రెండున్నూ శ్రీ గురువుగా రచ్చొత్తించిన్నీ నిప్ర్పయోజన మనుకొనోయేమో అణఁచి పెట్టిన పుస్తకంవల్ల స్థిరపడుతూన్నాయి. విమర్శకులైనవారు వీటి నిజానిజాలను విమర్శించి తేల్చుకో గలిగినా, సర్వులున్నూ అట్లా తేల్చుకోజాలరుగదా అని మూఁడింటికి మూఁడు వ్యాసాలు వ్రాసి సంగతి సందర్భాలు తెలుపవలసి వచ్చింది. ఆయా సంగతులు తెల్పినంత మాత్రంలోనే నేను నిరపరాధి నవుతానని కాదు గాని లోకమేదో నిశ్చయించడానికివి కొంతవఱకయినా ఆధార మవుతాయికదా అని నా యాశ.