పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/767

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నా పాలకొల్లు ప్రయాణము

871

యిఁక వెనుకటి తరువాయి టూకీగా వుదాహరించి దీన్ని ముగిస్తాను. కృతిసమర్పణం శుక్రవారం ఉదయం జరిగింది. నాఁటి మధ్యాహ్నం విష్ణ్వాలయంలో నా ఉపన్యాసం నలుగురితోపాటుగా జరిగింది. కాని అడ్వర్టెయిజమెంటు లోపంచే గ్రామంలో చాలమందికి తెలియనే లేదని పలుమంది అన్నారు. అందుచేత శనివారం శివాలయంలో నా ఉపన్యాసానికింకొక సభ కావాలని యత్నించారు. యీ సభకు మొట్టమొదటి కారకుఁడు నా చిన్నతనంలో సుమారు పదిపండ్రెండేండ్లు మా కుటుంబము కాపురంగా వున్న యానాం కాపురస్థుఁడున్నూ ప్రస్తుతం పాలకొల్లు కాపురస్థుఁడున్నూ అయిన వక కోమటిబిడ్డయే అన్నది ముఖ్యాంశం. యితనికెట్లో నా రాక తెలిసి మఱునాఁడు వెతుక్కుంటూ నా బసకు వచ్చి ‘నేను ఫలానా" అని చెప్పి కుశలప్రశ్నలు వగయిరాలయిన తర్వాత మీకు బహుమాన మేమాత్రమన్నాఁడు. నా కిక్కడ బహుమతీ జరగడాని కేమిన్నీ ప్రసక్తి లేదనిన్నీ నేను ఫలానా సందర్భంలో వచ్చాననిన్నీ చెప్పాను. కాని అతనికి సంతుష్టి లేనట్లు నాకు తోఁచింది. తరువాత అతఁడు రాక రాక మీరీవూరు వచ్చారు, వృథాగా వెళ్లకూడదు. సభ కావాలి, అనడానికి మొదలెట్టేడు. దానికేం మఱొకప్పుడు వస్తానన్నాను. కాని అతని మనస్సుకు తృప్తి కలిగినట్లుమాత్రం నాకు తోఁచలేదు. పిమ్మట అతఁడు వాళ్లింటికి వాళ్ల వాళ్లంతా నన్ను చూడడానికని వెంటబెట్టుకు వెళ్లాడు. చిన్నప్పుడెఱిఁగిన వాళ్లవడంచేత చూడడానికి నాకున్నూ కుతూహలంగా వుంది. వెళ్లాను. అతనితల్లి కొంత వృద్ధురాలు. నన్ను చూచి చిన్ననాఁటి నాచేష్టలు జ్ఞాపకం చేస్తూ ప్రస్తుతపు నా కుటుంబస్థితిగతులు నడిగి తెలిసికొంటూ మిక్కిలిగా సంతోషించి నన్నాదరించింది. తరువాత బసకు చక్కా వచ్చాను. బస దాఁకా ఆపూర్వ పరిచితుఁడు దిగఁబెట్టి యింటికి వెళ్లాడు. మళ్లా యింకొక కాపుగృహస్థును వెంటఁబెట్టుకొని మధ్యాహ్నం రెండు గంటల వేళ నా దగ్గఱికి వచ్చి, యీ వూళ్ళో మీరింకొక సభ చేయకుండా వెళ్లడానికి వల్లకాదు, నిన్న మీ వుపన్యాసం వుందన్నమాట వూళ్ళో యేకొందఱికో తప్ప సర్వే సర్వత్ర తెలియక పోవడంచేత చాలామంది రానేలేదు, అని చెప్పడానికి మొదలేశాడు. నేను అతనితో రేపు నరసాపురం వెళ్లక తప్పదు. వస్తానని చెప్పివున్నాను. యీ రోజుననే అయితే చిక్కులేదు, అని జవాబుచెప్పాను. అతఁడు కొంతప్రయత్నం చేశాడుగాని నంత అడావడిచేత ఆవేళ సభకు షాహుకార్లెవరూ వచ్చేటట్టు లేకపోయింది. అప్పుడు నర్సాపురానికి వెళ్లి “ఆదివారం కూడా మా వూళ్ళో సభ అయితేనేకాని శాస్త్రులుగా రీవూరికి రావడానికి వీలులేదు" అని వారితో వినయంగా శ్రుతపఱిచి "మాకు సోమవారం వచ్చినా సరే అయిదు గంటల తర్వాత జరిగేది కనుక ఆవేళకు అందఱికీ తీరిక అవుతుం" దని అనిపించుకొని వచ్చినాఁడు.