పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/764

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

868

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యిఁక నొకపరి మీ వుపన్యాసాన్ని వినాలి, కాఁబట్టి మీరు నర్సాపురం తప్పక రావలసిందని కోరినారు. అట్లే మీయాదేశ ప్రకారం వస్తానన్నాను. తరువాయి సంగతి ప్రస్తుతానికంతగా సంబంధించేది కాదు. కాకపోయినా ప్రధానాంశం వ్రాసి తర్వాత తరువాయి కూడా వ్రాసి మఱి ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

ప్రధానాంశమేమిటంటే; ఇంతవఱకు నేవ్రాసిన సంగతి సందర్భాలనుబట్టి చూస్తే యెవరికిఁగాని నేను గురువుగారి విషయంలో చేసిన అపరాధ మేమాత్రమేనా వున్నట్టు తోస్తుందేమో ఆలోచించాలి. యీ నా వ్రాఁతే అసత్యమనికాని, యిందులో కొంత భాగం అసత్యమనికాని శంకించేయెడల నాఁటి సభ్యులలో యెవరినేని కనుక్కొని పిమ్మట ప్రధాన విషయాన్ని విమర్శించడం మంచిది. కొందఱిపేర్లు వెనుక వుదాహరించే వున్నాను. ఆ నాళం కృష్ణారావుగారుగాని, నారాయణదేవుగారుగాని యిందులో నేమాత్రమేనా వ్యత్యాసం వుంటె తెల్పకపోరని నా విశ్వాసం. జరిగిన విషయ మిట్లుండఁగా శ్రీ గురువుగారు తమ “దురుద్ధరదోషశృంఖలంలో" యేలా లిఖించారో నన్నుఁగూర్చి చూడండి. "తుదకు పాలకొల్లులో కృతిగ్రహణ సమయమున నెట్లో చెప్పుదునని యెట్లో చెప్పినారు." నాకు గురువుగారు వ్రాసిన యీ వాక్యం చూచి యిప్పటికి సుమారు నాల్గువత్సరములన్నఱ దాఁటవచ్చిననూ తాత్పర్యం బోధపడ్డదేకాదు. గురువుగారి పొత్తము చూడక మునుపు కూడా యేదో వారు నా విషయంలో అనుమానపడ్డట్టు మాత్రం వారివారివల్ల విన్నాను. విన్నప్పటికీ వెనువెంట ఆ అనుమానాన్ని నాళం కృష్ణారావుగారు మొదలైనవారు సహేతుకం కాదని తెలిపి నివర్తింపచేసి నట్లుకూడా వినివుండడంచేత సవరణయిందికదా అని సంతోషించాను. యీ అనుమానానికి ఆస్పదం గురువుగారి కెప్పుడు తటస్థించిందంటే ప్రభవ సంll జ్యేష్టంలో పాలకొల్లుసభలో కృతిగ్రహణానంతరం నేయిచ్చిన వుపన్యాసంలో కదా? వెనువెంటనేకాని కొన్ని మాసాల్లోనేకాని యిది అపోహకాని వేఱుకాదని మిత్రుల బోధవల్ల నేమి, వారంతట వారికేగాని యేమి, అవగతం అయిందని నే ననుకొని సంతోషించడానికి హేతువేమిటంటే, విభవ సంll వైశాఖంలో గొల్లప్రోలులో అయిన మా పెద్ద చిరంజీవి వివాహానికి శ్రీ గురువుగారు దయచేసి ఆశీర్వదించడమే అందుచేత నామనస్సులో కల్గిన పరితాపం పటాపంచలై పోయింది. పిమ్మట కొల్లాపురం గొడవ వచ్చింది. గురువుగారికిన్నీ ఆ సంస్థాన పండితులు శ్రీ వనం సీతారామశాస్త్రుల్లుగారికిన్నీ యేదో వివాద మారంభ మయింది. ఆ వివాదసందర్భంలో పండితుల అభిప్రాయా లివ్వవలసివచ్చింది. ఆ యిచ్చిన వారిలోనే కూడా చేరవలసి వచ్చింది. దానితో గురువుగారికి పట్టరాని కోపం వచ్చి నన్నేకాక ఆ పండితులనందఱినీ విమర్శించి ప్రకటించి వోడ గొడదామనే కుతూహలంతో వకపుస్తకం వ్రాసి అచ్చు వేయవలసివచ్చింది. కాని తిరిగీ