పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/708

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

812

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ఈ పద్యం వల్ల వేంకటేశ్వరరావు శేషగిరిరావులయందు చూపిన కృతజ్ఞత్వానికి భంగం కలుగుతూన్నట్లు స్థూల దృష్టికి తోస్తుందికాని, మందు వాడిన పిమ్మటనే ఆరోగ్యం కలిగినట్లు వెనుకటి పద్యంలో స్థిరపఱచడం వల్ల మందుకు భగవత్సహాయం అనుపానంగా మాత్రం చూచుకోవలసి వస్తుంది. ప్రస్తుతస్తవంలో నేమి, యింతకు కొంచెం వెనుక వ్రాసిన ఆరోగ్యభాస్కరస్తవంలోనేమి, కంటి ఱెప్పవాలడాన్ని గుఱించి వ్రాస్తూ 'నా కనువైద్య మీవకృపమైఁ జేయంగదే భాస్కరా' లోనగు కొన్నిప్రయోగాలు అక్కడ అప్రయత్నంగా పడ్డాయి. వాటికి తార్కాణంగా యే వైద్యమూ లేకుండానే కనుఱెప్పదానంతట అదే యధాపూర్వకంగా వాలిన అయిదు నెలలక్కాబోలును లేచింది. యీ విషయం కూడా కొన్ని పద్యాలలో మృత్యుంజయస్తవంలోనే కొంచెం వివరించాను. గ్రంథవిస్తరభీతిచే వాటినిక్కడ వుదాహరించను. దానికి మాత్రం భగవత్కృపనే మందుగా భావించుకోక తప్పదు. మనకిది క్రొత్తగాదు. మనపూర్వులు "తచ్ఛాంతి రౌషధైర్దానైర్జపహోమసురార్చనైః" అని వ్రాశారు. ఇతరులీ మాట నెంతగాపాటించినా, నేమాత్రం చాలాకాలాన్నుంచి వ్యాధి విమోచనానికి దీన్నే విశేషించి వాడుతూన్నట్లు ఆరోగ్యకామేశ్వరిలోనైన నా పుస్తకాలవల్ల లోకులు గ్రహిస్తారు కాబట్టి విస్తరింపను.

ఇక రెండో మనుగుడుపును గూర్చి సంగ్రహంగా చెప్పి ముగిస్తాను. కొంచెం ఆరోగ్యం కలిగినట్టు తెలిసింది మొదలుకొని రెండోమామగారు బందరుకు రమ్మని మఱీ ఆహ్వానించడం మొదలెట్టేడు. యెంత ఆరోగ్యం? యెట్లో యింట్లో సంచరించడానికి మాత్రం తగ్గదేకాని యెక్కువదికాదు. అత్తారింటికెళ్లే అల్లుడంటే యెల్లా వుండాలి? యేలాబయలు దేరను? యేలా రాను? వస్తానని రాస్తూ వుండడం, ప్రయాణం నిజంగా పెట్టుకోడం, యే జట్కావాడు చేసిన మోసమో దాన్ని వారించడం, యిలా కొన్నాళ్లు జరిగాయి. తుట్టతుదకు మాగ్రామ సమీపంలో తణుకు దగ్గఱ తేతలిగ్రామంలో ఒక సభకు ఆహ్వానించారు. అర్ధాంగీకారంగా వస్తానన్నాను. ఆమాట బాధించింది. వారు వచ్చి కూర్చున్నారు. అపారమైన పడిసెం బాధించడానికి నాడే ఆరంభించింది. యేలాగ బయలుదేరడం? వారు వదిలేరు కారు, రైలెక్కేను. ఆవూరు వెళ్లేను. యెట్లో ఆసభలు జరిగాయి. ఆరోగ్యం కుదుటబడలేదు. మళ్లా అక్కడ నుంచి వెనక్కి పట్టించాను. వీలుగా లేనప్పుడేమిటి చేసేది? “మాధవా? మన రథములు మరలనిమ్ము, బ్రదికియుండిన సుఖములు వడయవచ్చు" మన మంతకంటె యెక్కువ వాళ్లమా? రాజమండ్రీలో వక శిష్యుడి తాలూకు చుట్టాల మూలాన్ని దిగవలసి వచ్చింది. అక్కడ ఆ వడ్డి సంఘంవారు స్వాగతం, సుస్వాగతం, వగయిరా మర్యాదలు జరిగించారు. తరువాత నేను మామూలుగా వెళ్లే సోమెన కామేశ్వరరావుగారింటికి వెళ్లేను. మఱునాడు యింటికి వెళ్లాలనుకుంటున్నాను. అంతలో ట్రయినింగు కాలేజీ విద్యార్థులు