పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/651

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వమూ-బ్రాహ్మణత్వమూ

755


లేదన్నాఁడు. ఆ యీ వాక్యం సిద్ధాంతకౌముదిలో మొదటి పుటలోనే వుంది. దీన్నిబట్టి శాస్త్రప్రవేశం యెందఱికి (కష్టించి కృషి చేసిన వారికే) అవుతుందో తెలుసుకోవచ్చును. తర్క వ్యాకరణాలు కనక సంప్రదాయంగా వచ్చివుంటే తక్కిన శాస్త్రాలలో త్వరగానే ప్రవేశం కలుగుతుంది. కాని అవి త్వరలో ప్రవేశం కలగనీయవు. తపోహిదురతిక్రమం. కొంత వోపికపట్టి చదివితే వ్యాకరణానికి అనుగ్రహం కలిగి పేలపిండిమాదిరిని చరచర అనుభూతం అవుతుందిగాని తర్కం ఆలాటిది కాదు. చదివినకొద్దీ అయోమయంగా పరిణమిస్తుంది. అందుచేతనే “అయోముఖమూ, పిష్టగర్భమూ” అంటారు వ్యాకరణాన్ని తర్కాన్నో? “పిష్టముఖమూ, అయోగర్భమూ" అంటారు. దీన్ని యీలా వుంచుదాం.

నేఁటికాలంలో ప్రతివిషయమూ తల్లక్రిందులుగా మాఱింది. పూర్వం యేది మంచో అది యిప్పుడుచెడ్డ. మీసాలను గూర్చి చర్చించుకుందాం. అవి వుంచుకోవడం పూర్వం ప్రతాపానికే కాదు, షోకుక్కూడా స్ఫోరకం. యిప్పుడో? అవి యేపూటకాపూట అంట గొరుక్కుంటేనే తప్ప కచేరీలోనూ అర్హత లేదు, గదిలోనూఅర్హత లేదు. మహమ్మదీయులు, క్షత్రియులు, వెలమవారు వీరందఱూ ప్రాణాన్నేనా గడ్డిపఱక మూదిరిని త్యజించేవారుగాని మీసాన్ని త్యజించేవారుకాదు. యిప్పుడో? ఆయీ పౌరుషప్రధానజాతులవారందరూ బీదలు పాచీపని స్వయంగా చేసుకున్నట్లు మీసాలవిషయంలో చాలా శ్రద్ధపుచ్చుకోవడం అందఱూ యెఱిఁగిందే. మీసంలోవుండే వెండ్రుకలు తాకట్టుపెడితే పూర్వం కరెన్సీకన్నాయినుమిక్కిలిగా పనిచేసేవి. యెందఱో పౌరుషవంతులు ఋణం తెచ్చుకోడానికి తాకట్టుకు వాట్లనే వుపయోగించుకొనేవారని వినికిడి. మీసాలకూ, గడ్డాలకూ సంబంధించిన యితిహాసాలు చాలావున్నాయి. (కవులు శ్లోకాలూ, పద్యాలూ తాకట్టు పెడితే పౌరుషవంతులు మీసాలు) ఆయిసుక పాతర త్రవ్వడానికి మొదలెడితే వ్యాసం తేలదు. ఒక మతగురువుగారి మీసమూ, గడ్డమూ దాఁచి వుంచి ఆమతస్థులలో మహారాజు లెవరేనా ఆ పవిత్రస్థలానికి యాత్రకు వెడితే వొకవెండ్రుకను ప్రసాదంగా యిస్తారని చెప్పఁగా విన్నాను. 'హైఫేమిలీ' వారికే గాని ఆరాజులలోకూడా ఆప్రసాదం ముట్టదఁట! అట్టి మహాపదార్థం "శివ! శివ! తాని లుఠంతి గృధ్రపాదైః" అనే దురవస్థకు లక్ష్యమయింది. (అసలు తీసివేసినా అందమే మఱో దురవస్థ? సిగ్గుసిగ్గు)

మనకు ప్రస్తుతం కవిత్వం. దానికీ పాండిత్యానికీ చుట్టరికం వుందా? లేదా? అనేది. అక్కఱలేదని పలువురు శఠిస్తూన్నారు, అంతలో సరిపెడితే సంతసమే. సిగ్గు సిగ్గు! యెంతటి మహాకవినేనాసరే 'పుంసివా కొమ్మెక్కి' రకం కవులు ధిక్కరిస్తూన్నారు. అంతతో సరిపెట్టడం లేదు. “నీకేం తెలుసు పో వెధవ, కుంక, ముండమోపి," యిత్యాదిగా వావిడుచుచున్నారు.