పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/641

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నీ కవిత్వాలేనా?

745


సుందరరామయ్య నావద్ద కొంతకాలము శుశ్రూష చేసినవాడు. కాని జన్మతః కవి. శిష్యాభిమానంకింద నా ప్రశంస జమకడతారేమో? చదువరులు యీశంక కవకాశం లేకపోదుగాని అక్కడక్కడ యింకా రసగ్రహణపరాయణు లున్నారని నా నమ్మిక. వారు యథార్థాన్ని గుర్తించితీరుతారు. “శ్రీ వెలయంగ సత్కవిత జెప్పెడివాడన" అని ప్రారంభించి కొన్ని విశేషాలు యేకరువెట్టి, పెట్టి తుట్టతుదకు "కొంటెలలోన గొంటెయున్ గావలె" అని ముగించబడింది. మాబుచ్చి సుందరుడు నిజానికి కొంటెవాడు కాడుగాక అతని ప్రకృతిలో యితరులకు కొంటెతనం గోచరిస్తుంది. బాధ పడేటప్పుడు కూడా దాని అధికారం అది చలాయించడంవల్ల అది యితనికి సహజమని ప్రాజ్ఞలోకం మన్నించి క్షమించాలి. యితడు నాశిష్యుడని చెప్పేమాటలు కావివి. బహుయోగ్యుడు. రాముని పేరితనికి పెట్టినందుకు ఆమహామహునియందున్న గుణాలలో ప్రధానగుణాలు నితనియందు కొన్ని వున్నాయని నేననుకుంటాను. ఇతడితరభాషాపదాలు వాడడంలో దిట్టకవి నారాయణ కవికి దీటంటే చాలదు. యింకా వొకమెట్టు పైనే వుంటాడు. “డాక్టరైనఁ గొమ్ములు దిర్గుయాక్టరైన" ఇత్యాదు లితనికవిత్వంలో రసోచితంగా దొర్లుతూ వుంటాయి - పొదిగించుకోవడం, స్వర్గాన్నుండి వూడిపడడం, విశేషించి కలగడం, కర్ణకుండలాలతో పుట్టడం, వగైరారచన ఆంధ్ర కవిత్వం పుట్టిన తేదీ మొదలు నేటివరకు యే కవిన్నీ చేయనేలేదేమో అని నే ననుకుంటాను. సినిమా యాక్టర్లు రసజ్ఞులే అయితే యితనివల్ల పొందిన వుపకారానికి యేదో సభచేసి శక్తివంచనలేకుండా సమ్మానించి ఋణం తీర్చుకుంటారని నేనభిప్రాయపడతాను. ఇతనివల్ల వారిపేరు శాశ్వతమయింది. తారాపదం సార్థకం చేశాఁడీ స్వయంవ్యక్తుడు. పోతే సినీమాలు పోవచ్చు వాట్లకోసం కట్టిన హాల్సుపోవచ్చుఁగాని మా బుచ్చి సుందర రామకవిరచనకెల్ల శిరోభూషణం, వ్యంగ్య కవిత్వానికే శిరోభూషణం, వేయేల? ఆంధ్రకవిత్వానికే శిరోభూషణం, “కవచకుండలాల” పద్యం మాత్రం పోదు. యీ బుచ్చికవికి కవచకుండలాలు బహుమతీ చేసిగాని నిద్దురపోరు రసికులని నా వూహ. ఆనాటికర్ణుఁడు యీ నాఁడు వుంటేనా? మజాఖా తెలిసేది. ఇది విషయాంతరం. ప్రస్తుతం శిష్యుడు పడుచున్నబాధ మృత్యుంజయుడు కనిపెట్టి తన అరిష్టవార కత్వాన్ని (అరిష్టవారక శంభుః) సార్థకపఱచుకొని యింకను అనేకగ్రంథాలు క్రొత్తపోకడలతో నితనిచే రచింపఁజేసి యనుగ్రహించుఁగాక అని ఆశీర్వచిస్తూ దీన్ని ముగిస్తున్నాను.

శిష్యుణ్ణిగూర్చి ప్రశంసించడం తప్పని యెరుఁగనివాణ్ణి కాను. యెఱిగిన్నీ చేసినతప్పుగా దీన్ని ప్రాజ్ఞలోకం మన్నిస్తుందని సాహసించి మనస్సులో దాచుకో లేక యీ నాలుగుమాటలు వ్రాశాను. యే నాల్గురోజులో శిష్యుఁడైనంతమాత్రంలో వాఁడు లోకం మెచ్చేకవిత్వం