పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/631

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రచయితలు

735


నట్లయింది. అయితే, లౌకికవ్యవహారానికి సంబంధించిన కోర్టుతీర్పులు, వకాల్తానామాలు, యింకా యెట్సెట్రాలు రచనలనిపించుకుంటాయా? వార్తాపత్రికలలోని - హఠాన్మరణం! పెద్దాపురపు సత్రం వసారానుండి రెండు పిచ్చుకగుడ్లు కిందబడి అసువులు విడిచాయి. జనోపకారం. మా వూళ్లో వచ్చే యేడు యింకో కల్లుదుకాణం పెట్టిస్తారట. కొన్ని యీ మాదిరి వ్రాతలూ రచన లనిపించుకుంటాయా? అని ప్రశ్నిస్తే జవాబు సులభమే కాని స్థలం కొంత వృథాగా ఆక్రమిస్తుంది. రచన అన్నప్పుడు దాని పఠనంవల్ల, లేదా, శ్రవణంవల్ల యేదో మనస్సుకు కొంత ఆనందం కలగాలి. యీలా లక్షణపరిష్కారం చేసుకుంటే మనకు, కోర్టు జడ్జిమెంట్లు వగయిరాలు వచ్చి మామాటేం చెపుతా వని ప్రశ్నించనేరవు. వీన్ని గుఱించి పుష్కరకాలానికి పూర్వం కృష్ణాపత్రికలో కవిత్వమంటే యేమిటి?' అనే శీర్షికకింద కొంత వ్రాసినట్లే జ్ఞాపకం.

నిన్న మొన్నటిదాకా రచన వ్యాకరణ సమ్మతంగా వుండాలి అనే ప్రతిబంధకంవుండేది. యిటీవల ఆ ప్రతిబంధకం పూర్తిగా వైతొలగింది. దీన్నిగుఱించి కీ.శే. లు గిడుగు పంతులుగారు స్మరణీయులు. కం. వీ. పంతులుగారి వచనరచన చాలాభాగం వ్యావహారికమే కాని, గిడుగువారి కున్నంత పట్టుదల ప్రస్తుతవిషయంలో కం. వీ. పంతులవారికిలేదు. గిడుగు పంతులుగారి పట్టుదలకు వున్న తాత్పర్యం తోసివేయదగ్గది కాదు.

“కరగాచింది హుళక్కి ద్రోవదికికో
       కల్ మెచ్చి యిచ్చింది, ద
 బ్బరకాకాసురునిన్ గటాక్షమునచే
       పట్టిం దబద్ధం బహో ... ... ".

ఈ పద్యంలో వున్న కాచింది, యిచ్చింది, చేపట్టింది, అనే మూడున్నూ దిద్దితే కాచినది, ఇచ్చినది, చేపట్టినది, అని యగును కాని మొదటి పాఠాని కున్నంత శ్రవణసుఖం వుండదు. “పన్నెండేలా రాజు రాణువా బొబ్బిలి గమ్మింది.” “నూగునూగుమీసాలవారయా నూటి కెలమ దొరలు."

ఆయా వాక్యాలు దిద్దితే యీసొగసు రాదని పంతులుగారి వాదం, ఆయీ వాదం వట్టివాదం కాదనిన్నీ యీ రచనలు వైద్యజ్యౌతిషములకు సంబంధించిన రచనలవలెనే అర్థప్రధానములు గాని శబ్దప్రధానములు కావనిన్నీ నా మనస్సుకు తోచి నేను పంతులుగారిని ప్రతిఘటించలేదు. బొబ్బిలి యుద్ధాన్ని "జంగంకథ"గా మొట్టమొదట యెవరో (పేరు తెలియదు.) వ్రాశారు. చాలాకాలం తద్ద్వారాగానే దాని ప్రచారం సాగింది. పిమ్మట దిట్టకవి