పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/611

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యేది కవిత్వం - 1

715


నన్నమాటకు అందఱూ అంగీకరించేదే. కాని లోకాదరం ఆయీ హేతువులను పురస్కరించుకొని పుట్టేదికాదు. కవి కష్టపడే రచించాఁడో? కాకుండానే రచించాఁడో? ఆయీ విషయం పాఠకలోకానికి అవసరంలేదు. చెవికి యింపుగా హాయిగా చల్లగా మెల్లగా తగలడమే కావాలి.

ఉ. ఏవనితల్ మమున్ దలఁప నేమిపనో? తమ రాడువారుగా
    రో? వలపింపఁగా నెఱుఁగరో? తమ కౌఁగిటిలోన నుండఁగా
    “రావది యేమిరా? విజయ రాఘవ?" యం చిలుదూరి బల్మిమైఁ
    దీవరకత్తెనై పెనఁగి తీసుకవచ్చితినో? తలోదరీ.

యీపద్యం వొకమహారాజుగారి సాని బోగమావిడ కట్టింది. యిందులో యమకంలేదు, శ్లేషలేదు. సంస్కృతసమాసాలులేవు. కట్టిన ఆవిడకు వేదశాస్త్ర శ్రౌతాలలో పాండిత్యం వుందని చెప్పడానికి అవకాశం అంతకంటేలేదు. నియమనిష్ఠలు కలదనడానికి యే విజ్ఞులూ అంగీకరించరు. "విటునకు సత్యశౌచములు వేశ్యకు నేమములేదు" గదా? పైని వుటంకించినకారణా లేవిన్నీ లేకపోయినా యిది యేగ్రంథంలోనూ వున్నది కాకపోయినా అధమం వక శతాబ్దానికి తక్కువకాలంలోది కాకపోయినా యిప్పటిదాఁకానే కాదు యింకా యెంతకాలమేనా వుంటుందని నానమ్మకం. దానిక్కారణం యిందులో వున్న రసమే. వేశ్యాత్వాన్ని యెంత సొగసుగానో ప్రకటిస్తూ వున్న యీపద్యంలో వున్న సొగసుయెన్ని “లలనాజనాపాంగాలలో" సంపాదించఁగలం? యింకొకపద్యంకూడా చూడండి.

ఉ. ఎన్నఁడునేరిచెన్ బెళుకులీచెలికన్నులు కారుకమ్ముల
    న్నన్నకురుల్, పిఱుందు వటువై పటువైఖరి గైకొనెం గదే
    మొన్నగదమ్మ పిన్న మొనమొల్కలు నేఁడిదె వన్నెలాడిలేఁ
    జన్నులుమిన్నలై పయఁటసందున డాఁగురుమూఁతలాడెడిన్.

యీ పద్యం కంసాలి రుద్రయ్యదని చెప్పుకుంటారు. యెంతమంది బ్రాహ్మణకవులు గుమిగూడితే యీ విశ్వబ్రాహ్మఁడికి దీటవుతారు? యీలాటి కవి వారిలో వున్నా ఆ శాఖీయులు తెనాలిరామలింగాన్ని కూడా తమవాఁడని అన్యాయంగా చెప్పుకుంటారు. లోకాదరాన్ని చూఱగొనే కవికి ఆరంభకాలంలోనే రసవంతమైన కవిత్వమేదో? అట్టిది కాని కవిత్వమేదో? తెలుసుకునే సామర్థ్యం యేర్పడాలి (అది దైవాధీనం). అది యేర్పడ్డాక వాఁడేదేనా రచిస్తే దానిలో అంతా కాకపోయినా లేశమేనా లోకాదరణానికి పాత్రమవుతుంది. ఆలాటి జ్ఞానం అంకురించకుండా రచించే రచన "యతియుం బ్రాసయుఁ గూర్చుమాత్రఁగవియే" తరగతిలోకి జమవుతుంది. ఆయీ విషయం సంస్కృతంలో బాగా