పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/610

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

714

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యమకం లేకుండా వారు చెప్పినపద్యం చాలా శ్రవణసుఖంగా వుంటుందని కూడా చెపుతాను. వొకటి మచ్చు చూపుతాను.

క. తళతళనై బెళబెళనై
    మిళమిళనై మేనికాంతి మిఱుమిట్లు గొనన్
    గళ లలుముకొనియె దిన మొక
    నెలవున లేజవ్వనంపునిగ్గులు దేఱెన్.

యీలాటి శైలిలో వున్న పద్యాలు కొన్ని లేకపోలేదు గాని మా ముత్తాతగారు విశేషించి యమకానికే పాటుపడ్డారు. యమకంమాత్రం కవిత్వంకాదా? అంటే? జవాబు చెప్పడం కష్టంగాని సహృదయులందఱున్నూ అది కవిత్వం కాదనే చెపుతారు. దానికోసమై కవికి యిష్టంలేకపోయినా కొంత పేకేజీ సరుకు చేరి తీరుతుంది. చూడండి యీపద్యాన్ని

“ఉ. నిన్నటిమాపు మాపురమణీరమణీయసభావిభాగభా
     గున్నత రత్నపీఠి గొలువుండి సురాంగనలాడఁ గిన్నరుల్
     గిన్నెర మీఁటి పాడఁ దిలకించుచు నిచ్చటి కేలరాఁడాకో?
     మన్నిరవద్యమిత్రుఁడని మన్నన నిన్నుమదిన్ దలంచితిన్"

యీ పద్యంలో నాల్గవచరణంలో వున్న “మన్నిరవద్యమిత్రుఁడు" అనేదానిలో వున్న - మన్నిరవద్య, అన్నపదం కేవలం ప్యాకేజీసరుకుగా దొర్లిందే. యిది యమకంకోసం కాదని వివాదించవచ్చును. ఆ పక్షంలో ప్రాసకోసమనుకోండి. భారతాదులలో అందులోనూ ముఖ్యంగా నన్నయ్యగారి కవిత్వంలో అప్రయత్నంగా కొంత యమకం దొర్లుతుంది. అది ప్యాకేజీసరుకుగా వుండదు. మచ్చుచూపుతాను.

ఉ. భారతభారతీ శుభగభస్తిచయంబుల
మ. మదమాతంగ తురంగ కాంచనలసన్మాణిక్య గాణిక్య
ఉ. పాయకపాకశాసనికి భారత ఘోరరణమ్మునందు

యిత్యాదులు చూచుకోండి. యీయమకం “మన్నిరవద్యమిత్రుఁడు" మాదిరిగానే వుందో? అన్యథాగానే వుందో సహృదయులు పరిశీలింపఁగలరు. యమకంలాగే - చిత్రకవిత్వంకూడా శబ్దాన్ని ఆశ్రయించికొని వుండేదే రామకృష్ణ విలోమకావ్యం లోనైనవన్నీ బహుపరిశ్రమచేత సాధించినవేకాని వాట్లను ఆదరించే పాఠకలోకం చాలా తక్కువ. అంతదాఁకాయెందుకు? రాఘవపాండవీయం మట్టుకు యెందఱు చదువుతారో ఆలోచించండి. వాట్లరచన బహుకష్టసాధ్యమే కాక బహుతర పాండిత్య సాధ్యంకూడా