పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/598

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

702

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


చ. “హితము వచింపఁ దా వొసఁగునెవ్వఁడు వాఁడెవఁడున్ వినండ భా
    రతముననేమి తక్కిన పురాణములందుననేమి యెవ్వఁడే
    హితము గణించె నట్లని మఱెవ్వఁడు చెప్పుటమానెఁ జెప్పుటే
    చతురునకో యగున్ గణన సల్పి కృతార్థుఁడు వేఱొకం డగున్”

అథవా నాకు ఆ గేయంలో వుండే రసం తెలియకనే పోవచ్చును, యేమీ యెందుకు తెలియాలి? “నహి సర్వ స్సర్వం విజానాతి" కదా! అందుకే నేను నావ్యాసంలో "కొందఱు రసజ్ఞులు నచ్చినవారుంటే వారి వారి చేవ్రాళ్లతో అభిప్రాయాలు సంపాదించి పత్రికాముఖాన్ని ప్రకటిస్తే.. నేనూ వారితో యేకీభవిస్తాను" అని యీలా హృదయం విప్పి వ్రాసినప్పటికీ యేదో కోలాహలం చేస్తూ "మొదటివ్యాసానికీ యీవ్యాసానికీ వచ్చినమార్పు" అంటూ గ్రంథం పెంచడం నాకు "కర్ణాటకలహం"గా కనుపడుతూ వుంది. కనక కాస్త్రపిండిగలవా రేమంటారో కనుక్కొని ఆలా చేయవలసిందని హెచ్చరిస్తూ దీనికి స్వస్తిచెపుతాను.

★ ★ ★